Home Remedies Get Rid Of Mosquitoes :ఏ కాలమైనాదోమలు విజృంభిస్తుంటాయి. దీంతో చాలా మంది వాటిని తరిమికొట్టేందుకు రకరకాల మస్కిటో రిపెల్లెంట్లు, కాయిల్స్ వంటివి యూజ్ చేస్తుంటారు. అయితే.. అవి దోమల్ని తరిమికొట్టడం అటుంచితే.. వాటిలో ఉండే కెమికల్స్ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. సహజ సిద్ధంగా దోమల(Mosquitoes) బెడదను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
వేప నూనె, కర్పూరం, బిర్యానీ ఆకులు :చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వేప నూనె తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు కర్పూరం బిల్లలను వేసుకొని కరిగించుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బిర్యానీ ఆకులకు పూసి, ఆకులను కాల్చడం ద్వారా వచ్చే ఆ పొగకు దోమలు పారిపోతాయని చెబుతున్నారు.
వేప నూనె, కర్పూరంతో దీపం :కొద్దిగా వేపనూనె తీసుకొని అందులో కర్పూరం బిల్లలు వేసుకోవాలి. దీనిని స్టౌపై పెట్టి కరిగించుకోవాలి. ఆ ఆయిల్ని ఒక ప్రమిదలోకి పోసుకొని వత్తిని వేసుకొని దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించడం వల్ల ఆ వత్తి నుంచి వచ్చే పొగను దోమలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతాయని అంటున్నారు.
కర్పూరం, వేప ఆకుల పొగ :రోజూ మస్కిటో కాయిల్స్ వెలిగించే బదులు.. కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేపాకులు కలిపి 15 నిమిషాల పాటు పొగ వేయాలి. ఒకవేళ వేపాకులు లేకపోతే.. కర్పూరంతోనూ పొగ వేసినా దోమలు మళ్లీ ఇంట్లోకి రావంటున్నారు.
నిమ్మకాయ, లవంగాలు :నిమ్మకాయ లవంగాలను ఉపయోగించి దోమల బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందుకోసం.. నిమ్మకాయను రెండు ముక్కలుగా అడ్డంగా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలపై లవంగాలను గుచ్చి.. మంచానికి దగ్గరగా లేదా పడుకున్న చోటుకు దగ్గరగా పెట్టుకుంటే అక్కడ దోమలు రాకుండా ఉంటాయట.