Interesting Facts about Pink Ivory :ఎర్రచందనం.. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. స్మగ్లర్లైతే దీని కోసం ఎన్ని కోట్లైనా చెల్లిస్తుంటారు. ఇటీవల విడుదల అయిన పుష్ప-2 సినిమా కూడా ఎర్ర చందనం వ్యాపారం చుట్టే తిరుగుతోంది. ఈ క్రమంలోనే ఎక్కువ మందికి ఎర్రచందనం గురించి తెలిసి ఉంటుంది. కానీ, ఎప్పుడైనా ఈ "గులాబీ చందనం" గురించి విన్నారా? అవునండీ. మీరు వింటుంది నిజమే. గులాబీ చందనం కూడా ఉంది. ఇంతకీ, అసలేంటి ఈ గులాబీ చందనం? ఈ చెట్లు ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి? ఇవి దేనికి ప్రసిద్ధి? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీరు తెలుసుకోవాలనుకుంటున్న గులాబీ చందనం పేరు పింక్ ఐవరీ. దీన్నే పర్పుల్ ఐవరీ, రెడ్ ఐవరీ, ఉమ్నిని అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. దీనికి మంచి డిమాండే ఉంది. ఎంతలా అంటే.. ఇది ఎర్రచందనం కంటే ఖరీదైన కలప! దక్షిణాఫ్రికా, జింబాబ్వే, మొజాంబిక్, ఉత్తర బోట్స్‌వానాలో ఎక్కువగా పెరుగుతుంటాయి ఈ చెట్లు. దీని కలప చాలా గట్టిగా ఉంటుంది.
ఈ పింక్ ఐవరీ చెట్లకు రుచికరమైన పండ్లుకూడా కాస్తాయి. కానీ ఈ చెట్టు మాత్రం కలపకే ఎక్కువగా ప్రసిద్ధి అని చెప్పుకుంటారు. అంతేకాదు ఈ చెట్టు బెరడు లాంటి ఇతర భాగాల్లో ఔషధ గుణాలున్నాయని నమ్ముతుంటారు స్థానికులు. అందుకే వీటిని సంప్రదాయ వైద్యంలోనూ యూజ్ చేస్తుంటారు.
ఈ కలపతో ఆభరణాల తయారీ!
గులాబీ చందనంగా చెప్పుకునే పింక్ ఐవరీ ఆఫ్రికాకు చెందిన జులు ప్రజల రాజవృక్షం. గతంలో కేవలం రాజ కుటుంబీకులే ఈ చెట్టు కలపతో తయారైన వస్తువులు, ఆభరణాలు వాడేవారట. 1883లో జులులాండ్ బ్రిటిష్ వారి వశమయ్యేంత వరకు ఈ సంప్రదాయమే కొనసాగిందట. ప్రస్తుతం మాత్రం పింక్ ఐవరీ కర్ర అరుదైనది, అత్యంత విలువైనది. ఈ నేపథ్యంలోనే దీన్ని దక్షిణాఫ్రికాలో ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. అంతేకాదు పింక్ ఐవరీ చెట్లను చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నరకడానికి అనుమతి ఇస్తున్నారు.