How to Make Masala Pappu Chekkalu : దసరా వచ్చేస్తోంది. దీంతో ఎక్కువ మంది ఇప్పటి నుంచే ఇళ్లలో వివిధ రకాల పిండి వంటలు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అందులో ఒకటి.. మసాలా పప్పు చెక్కలు. అయితే, చాలా మందికి వీటిని సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడం రాదు. ఒకవేళ చేసుకున్నా గట్టిగా రావడమో, మెత్తగా రావడమో జరుగుతుంటుంది. అలాకాకుండా ఈ టిప్స్ పాటిస్తూ పిండిని కలిపి చెక్కలు(Chekkalu)ప్రిపేర్ చేసుకోండి. అవి చాలా టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి! ఇంతకీ.. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యప్పిండి - 4 కప్పులు(అరకిలో)
- పెసరపప్పు - పావు కప్పు
- శనగ పప్పు - పావు కప్పు
- కారం - 1 టీస్పూన్
- పసుపు - చిటికెడు
- ఉప్పు - రుచికి సరిపడా
- కరివేపాకు - 6 రెమ్మలు
- బటర్ - పావు కప్పు
- నూనె - వేయించడానికి సరిపడా
మసాలా కోసం :
- అల్లం - 2 ఇంచుల ముక్క
- పచ్చిమిర్చి - 4
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 20
- జీలకర్ర - 1 టీస్పూన్
దసరా స్పెషల్ టేస్టీ కజ్జికాయలు - ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు!
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్లో పెసరపప్పు, శనగపప్పును తీసుకొని గంటపాటు నానబెట్టుకోవాలి. ఈలోపు రెసిపీలోకి కావాల్సిన మసాలా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో పాటు పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లించుకున్న బియ్యప్పిండిని వేసుకోవాలి. ఆపై అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమం, కారం, పసుపు, ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుతరుగు వేసుకోవాలి.
- అలాగే.. ముందుగా నానబెట్టుకున్న పప్పులనూ వడకట్టి వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బటర్ వేసుకొని అది కరిగే వరకు కలుపుతూ వేడి చేసుకోవాలి. మీకు అందుబాటులో బటర్ లేకపోతే నూనె వేసుకోవచ్చు.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని ఆ వాటర్‌ను ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని గరిటెతో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అయితే, పిండి మరీ ముద్దగా కాకుండా తడిపొడిగానే ఉండాలి.
- ఆవిధంగా పిండిని మిక్స్ చేసుకున్నాక దానిపై మూతపెట్టి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా పిండి బాగా మగ్గుతుంది. దీని వల్ల పిండిలో జిగురు పెరిగి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి.
- 10 నిమిషాలయ్యాక మూతతీసి పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. అలాగే ఒకసారి ఉప్పు, కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో కొంచం పిండిని మరో వెడల్పాటి బౌల్లో తీసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. అయితే, పిండి మరీ సాఫ్ట్‌గా, గట్టిగా ఉండకుండా చూసుకోవాలి.
- అనంతరం ఆ పిండిని మీకు చెక్కలు కావాల్సిన సైజ్‌ను బట్టి చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకొని దానిపై ప్లాస్టిక్ కవర్స్ ఉంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ఉండను ఉంచి మీకు కావాల్సిన సైజ్‌లో నెమ్మదిగా వత్తుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక.. చెక్కలను ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి.
- తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే "మసాలా పప్పు చెక్కలు" రెడీ!
దసరా స్పెషల్ : జంతికలు చేస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే సూపర్ టేస్టీగా కరకరలాడిపోతాయ్!