తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రుచిలో ఆహా, ఆరోగ్యపరంగా ఓహో అనిపించే - కమ్మని "క్యాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ"! - CAULIFLOWER CHANA DAL RECIPE

చపాతీ, పూరీల్లోకి అద్దిరిపోయే కాంబినేషన్ - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

HOW TO MAKE CAULIFLOWER CHANA DAL
Cauliflower Chana Dal Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2024, 1:47 PM IST

Cauliflower Chana Dal Recipe in Telugu: పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయల్లో ఒకటి క్యాలీఫ్లవర్. కానీ, చాలా మంది దీనిని అంతగా తినడానికి ఇష్టపడరు. ఒకవేళ కొందరు వండుకున్నా వేపుడు, క్యాలీఫ్లవర్ రైస్ వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పటిలా కాకుండా ఓసారి ఇలా శనగపప్పుతో క్యాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేసుకొని చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది! క్యాలీఫ్లవర్అంటే ఇష్టపడని వారూ మళ్లీ మళ్లీ కావాలంటారు! మరి, ఈ సూపర్ టేస్టీ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపప్పు - పావు కప్పు
  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • క్యాలీఫ్లవర్ ముక్కలు - 300 గ్రాములు
  • పసుపు - పావుటీస్పూన్

టమాటా పేస్ట్​ కోసం :

  • ఆయిల్ - 2 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ధనియాలు - 2 టీస్పూన్లు
  • పచ్చిమిర్చి - 4
  • ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్​ది)
  • పచ్చికొబ్బరి ముక్కలు - పావు కప్పు
  • టమాటాలు - 3(పెద్ద సైజ్​వి)
  • కారం - 1 టీస్పూన్
  • పసుపు - పావుటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా

కర్రీ కోసం :

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • ఆవాలు - అరటీ​స్పూన్
  • జీలకర్ర - అరటీ​స్పూన్
  • కరివేపాకు - 3 రెమ్మలు
  • ఇంగువ - 2 చిటికెళ్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

సింపుల్​గా ఇలా "గోబీ 65" చేయండి - పిల్లలైతే మమ్మీ ఇంకొంచం పెట్టమ్మా అని అడిగి మరీ తింటారు!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి ఒక బౌల్​లో వేడి నీరు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి. ఆలోపు రెసిపీలోకి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్​ని సిద్ధం చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని 1 టేబుల్​స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కలు, పసుపు వేసి కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం టమాటా పేస్ట్​ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం అదే పాన్​లో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ధనియాలు వేసి ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఆనియన్స్ మెత్తబడే వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక పచ్చికొబ్బరి ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి అవి కాస్త సాఫ్ట్​గా మారేంత వరకు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి టమాటాలపై స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న టమాటా మిశ్రమంతో పాటు తగినన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై మళ్లీ అదే పాన్ పెట్టుకొని 1 టేబుల్​స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఆపై కరివేపాకు, ఇంగువ వేసి చక్కగా వేపుకోవాలి.
  • తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమం, ఒకటిన్నర కప్పుల వాటర్, గంటకు పైగా నానబెట్టుకున్న శనగపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ శనగపప్పు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అందుకోసం 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టొచ్చు.
  • శనగపప్పు చక్కగా ఉడికిందనుకున్నాక అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ మరో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఘుమఘుమలాడే కమ్మని "క్యాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ" రెడీ!
  • దీన్ని వేడివేడిగా అన్నం, చపాతీ, పూరీ, రోటీల్లోకి తింటుంటే కలిగే ఫీలింగ్ అద్భుతః అని చెప్పవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఆస్వాదించండి!

వెడ్డింగ్స్ స్పెషల్ క్రిస్పీ "కరివేపాకు క్యాలీఫ్లవర్ ఫ్రై" - ఇలా చేసి పెడితే అవి తిననివారూ ఇష్టంగా తింటారు!

ABOUT THE AUTHOR

...view details