తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చేదు లేకుండా కమ్మని "కాకరకాయ ఫ్రై" - ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు! పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు! - BITTER GOURD FRY RECIPE

మీ పిల్లలు కాకరకాయ తినడానికి ఇష్టపడట్లేదా? - ఇలా చేసి పెట్టారంటే ప్లేట్ మొత్తం ఖాళీ!

HOW TO MAKE KAKARAKAYA FRY
Bitter Gourd Fry Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2024, 1:44 PM IST

Bitter Gourd Fry Recipe in Telugu : కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, చాలా మంది చేదు అనే కారణంతో దీన్ని అంతగా తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలైతే కాకరకాయ కర్రీనా అంటూ మొహం చిట్లించుకుంటుంటారు. మీ పిల్లలు ఆ జాబితాలో ఉన్నారా? అయితే, ఓసారి ఇలా "కాకరకాయ ఫ్రై" చేసి పెట్టండి. అస్సలు చేదు ఉండదు! పైగా టేస్ట్ అద్దిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. దీన్ని కొత్తగా వంట చేసే వారు, బ్యాచిలర్స్​తో పాటు ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • కాకరకాయలు - అరకిలో
  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • ఉల్లిపాయ - 1(సన్నగా తరుక్కోవాలి)
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పసుపు - పావుటీస్పూన్
  • ఉప్పు - కొద్దిగా

వెల్లుల్లి కారం కోసం :

  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • జీలకర్ర - అరటీస్పూన్
  • కారం - 1 టేబుల్​స్పూన్
  • ఉప్పు - కొద్దిగా

తయారీ విధానం :

  • ముందుగా కాకరకాయలను చాకు లేదా పీలర్ సహాయంతో వాటిపై ఉండే చెక్కును తొలగించుకోవాలి. ఆ తర్వాత చెక్కు తీసిన కాకరకాయలను మధ్యలోకి కట్ చేసి ఆపై వాటిని నిలువుగా చీల్చి లోపల ఉన్న గింజల భాగాన్ని తొలగించాలి.
  • ఆ తర్వాత వాటిని క్యూబ్స్ మాదిరిగా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల కాకర ముక్కలు చక్కగా వేగి కర్రీ చాలా రుచిగా ఉంటుంది.
  • తదుపరి ఆవిధంగా కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్​లోకి తీసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కోట్ చేసి అరగంట పాటు అలా వదిలేయాలి.
  • అనంతరం ఉప్పులో ఊరిన కాకరకాయ ముక్కల్ని తీసుకొని చేతితో గట్టిగా పసరు పిండి మరో బౌల్​లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ ద్వారా చేదు చాలా వరకు తగ్గిపోతుంది.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకోవాలి.
  • తాలింపు వేగాక సన్నని ఉల్లిపాయతరుగు, కరివేపాకు, పసుపు వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా పసరు పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
  • ఆపై పాన్​ మీద మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ కాకరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అందుకోసం 15 నిమిషాల దాకా సమయం పట్టొచ్చు.
  • ఆలోపు వెల్లుల్లి కారం సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • కాకరకాయ ముక్కలు మంచిగా వేగాయనుకున్న తర్వాత.. ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని కలిపి మూతపెట్టకుండా మరో 10 నుంచి 15 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. అంతేకానీ, మరీ నల్లగా వేయించుకోవద్దు.
  • ఆవిధంగా వేయించుకున్నాక మీకు నచ్చితే ఒక చెంచా చక్కెర వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "కాకరకాయ ఫ్రై" రెడీ!

ఇవీ చదవండి :

కాకరకాయ తినలేకపోతున్నారా? - ఇలా "కాకర ఉల్లికారం" ప్రిపేర్ చేయండి - ప్లేట్ మొత్తం పక్కా ఖాళీ!

10 నిమిషాల్లోనే కమ్మటి "వెజిటబుల్ మసాలా రైస్ "​ - పిల్లలకు ఇష్టమైన రెసిపీ

ABOUT THE AUTHOR

...view details