Best Ideas for New Year Resolution :న్యూ ఇయర్ ప్రారంభం అవుతోంది అనగానే ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచనలు, కొంగొత్త ఆకాంక్షలు మెదులుతుంటాయి. ఇబ్బంది పెడుతున్న పాత అలవాట్లను వదిలించుకోవాలని భావించేవారు కొందరైతే, కొత్త విధానాలను అవలంబించాలని నిర్ణయించుకునేవారు ఇంకొందరు. సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో ఈ న్యూ ఇయర్ నుంచైనా కాస్త జోష్ నింపాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది రకరకాల రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. కొత్త ఏడాది నుంచి వాటికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంటారు.
ఈ క్రమంలోనే న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే పేరుకి అన్నీ మొదలుపెడతారు. తీరా రెండ్రోజులకే వాటిని పక్కన పెడుతుంటారు. కాబట్టి, మీరూ న్యూ ఇయర్ రిజల్యూషన్‌గా ఏదైనా అనుకుంటే దాన్ని ప్రారంభించడం కోసం జనవరి దాకా వెయిట్ చేయకుండా ఈరోజు నుంచే ఆచరణలో పెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మధ్యలోనే ఆగిపోకుండా, ఏడాదంతా సానుకూల దృక్పథంతో, సంతోషంగా ముందుకు సాగుతాయంటున్నారు. అంతేకాదు, అవి మీ ఆనందాలను రెట్టింపు చేస్తాయంటున్నారు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్‌లో డైలీ వ్యాయామం అనేది ఉంటుంది. మీ లిస్ట్‌లో కూడా అది ఉంటే ఇప్పట్నుంచే రోజూ ఓ పావుగంట చేయండి. తక్కువ సమయమే కాబట్టి, సరదాగా ఉంటుంది. మన గోల్ జనవరి కదా! మధ్యలో ఆపాలి అనిపించదు. అలా చేస్తూ చేస్తూ తెలియకుండానే అలవాటుగా మారిపోతుందంటున్నారు నిపుణులు. కొత్త సంవత్సరంలో కొనసాగించేస్తాం. అనుకున్నది చేస్తున్నామన్న సంతృప్తి కలుగుతుందంటున్నారు.
న్యూ ఇయర్ తీర్మానంగా జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు బదులుగా ఆరోగ్యకరమైనవే తినాలన్నది లక్ష్యమనుకుందాం. అయితే, కొత్త సంవత్సరం చికెన్ వద్దు, ఆయిల్ వద్దు, కూరగాయలు పండ్లే తినాలి అనుకుంటూ వెళితే నోరు చప్పబడిపోదూ? ఇంకేం కొనసాగిస్తాం? అందుకే ఈ టైమ్‌లో రుచిగా ఆరోగ్యంగా చేసుకునే రెసిపీలు సెర్చ్ చేయండి. ఒక్కొక్కటీ నెమ్మదిగా ప్రయత్నిస్తూ వెళ్లండి. అప్పుడు కఠినంగా అనిపించకపోవడమే కాకుండా నోటికి రుచికరమైనవి తింటున్నామనే ఫీలింగ్ కలుగుతుందంటున్నారు నిపుణులు.