Banana Flower Chutney Recipe in Telugu :ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఒకటి అరటి. దీనిలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది అరటిపండ్లనుడైట్లో భాగం చేసుకంటారు. అలాగే, కొంతమంది అరటికాయతో వేపుడు, కూర, పులుసు వంటి రకరకాల రెసిపీలు ప్రిపేర్ చేసుకుని తింటుంటారు. మరికొందరు అరటిదూటను ఆవపెట్టి కూడా వండుతుంటారు. అయితే, అవే కాదు.. అరటిపువ్వుతో రుచికరమైన వంటకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఒకటే.. "అరటిపువ్వు పచ్చడి". సూపర్ టేస్టీగా ఉండే ఈ పచ్చడిని ఒకసారి రుచి చూస్తే మీకూ బాగా నచ్చేస్తుంది! ఇంతకీ దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- అరటిపువ్వు - ఒకటి
- నువ్వులు - 1 టీస్పూన్
- మినప్పుప్పు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 10
- ధనియాలు - 1 టీస్పూన్
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- మెంతులు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- నూనె - తగినంత
- ఉప్పు - రుచికి సరిపడా
- ఇంగువ - కొద్దిగా
తాలింపు కోసం :
- నూనె - కొద్దిగా
- ఆవాలు - 1 టీస్పూన్
- మినప్పప్పు - 1 టీస్పూన్
- శనగపప్పు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రెబ్బలు - 4
- కరివేపాకు - కొద్దిగా
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా అరటిపువ్వును శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ధనియాలు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, నువ్వులు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఆ తర్వాత అరటిపువ్వు ముక్కలను కొద్దిసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పదార్థాలన్నింటిని వేసుకోవాలి. అలాగే ఇంగువ, ఉప్పు, చింతపండు వేసుకొని మెత్తగా పచ్చడిలా మిక్సీ పట్టుకోవాలి.
- అనంతరం పచ్చడికితాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని వేయించుకోవాలి.
- ఆపై కరివేపాకు, ఇంగువ వేసుకొని పోపును చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ తాలింపును ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "అరటిపువ్వు పచ్చడి" రెడీ!
- దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యివేసుకొని కలుపుకొని తింటుంటే కలిగే టేస్ట్ అద్భుతః అనకుండా ఉండలేరు! మీకు ఈ రెసిపీ నచ్చితే ఇప్పుడే ఓసారి ఇంటి ఈ పచ్చడిని ట్రై చేసి ఇంటిల్లిపాది ఆస్వాదించండి.
ఇవీ చదవండి :
జామకాయలను నేరుగా తినడమే కాదు - ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవల్!
ఫిష్ పులుసు పెట్టాలంటే చేపలే ఉండాలా ఏంటి? - వీటితో పులుసు పెడితే వహ్వా అనాల్సిందే!