Best Decoration Ideas for Balcony :మనం అందంగా రెడీ అవ్వడమే కాదు, ఇంటినీ చూడచక్కగా ఉంచుకోవాలని చూస్తాం. ఈ క్రమంలో ఎన్ని ముస్తాబులు చేసినా ఇంకాస్త కొత్తగా తీర్చిదిద్దుకోవాలనిపిస్తుంది. అలాగని ప్రతిసారీ కొత్త షో పీస్‌లు కొనడం, పెయింటింగ్ వేయించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అయితే, బాల్కనీనిసుందరంగా తీర్చిదిద్దాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీకు శ్రద్ధాసక్తులుంటే మార్కెట్లో లభించే కొన్ని చిన్న చిన్న వస్తువులతో పాటు ఈ టిప్స్ పాటిస్తే కూడా ఇంటిని అందంగా తీర్చిదిద్దొచ్చంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. ఇంతకీ, బాల్కనీ అందాన్ని పెంచే ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంటి గోడలు కాంతిమంతంగా ఉంటే మనకీ ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగని ప్రతిసారీ గోడలకు పెయింటింగ్ వేయించడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే, బాల్కనీలో ఓ వైపు గోడకు మీకు నచ్చిన వాల్ స్టిక్కర్‌ని సెలెక్ట్ చేసుకొని అతికించండి. పక్కనే ఓ రెండు ఇండోర్ ప్లాంట్స్, కూర్చోవడానికి కుర్చీలు సెట్ చేయండి. దాంతో మీ బాల్కనీకి కొత్తదనం వచ్చేస్తుందంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు.
చాలా మంది ఇంటి బాల్కనీలో ఎక్కువగా పూల మొక్కల కోసం కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. నిజానికి ఇవి బాల్కనీ అందాన్ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ కుండీలు కొన్ని రోజులకు ఎండకి ఎండి పాతబడిపోతుంటాయి. అలాంటి టైమ్‌లో గ్రిల్‌కి చక్కగా బ్లాక్ కలర్, కుండీలకు నచ్చిన రంగు వేసేయండి. దానిపై పోట్రెయిట్‌లు, ముగ్గులూ వంటివి పెడితే మరింత అందంగా కనిపిస్తాయంటున్నారు.
ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చర్ కనిపిస్తోంది. ఈ అపార్ట్మెంట్ కల్చర్‌లో పల్లెటూరు మాదిరిగా ప్రశాంతంగా ఆరుబయట కూర్చుని ప్రపంచాన్ని చూసేయలేకపోవచ్చు. కానీ, అందుకు తగినవిధంగా మీ బాల్కనీని మార్చేయొచ్చంటున్నారు. మీది అపార్ట్మెంట్ బాల్కనీ అయితే ఇలా ముస్తాబు చేసుకోండి. సరికొత్త అందంతో మెరిసిపోతుంది.