How to Make Onion Oil Naturally :పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, ఆహార మార్పులు.. వీటి కారణంగా చాలామంది చిన్న వయసులోనే వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని దూరం చేసుకునేందుకు మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులు, నూనెలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఎన్ని షాంపూలు మార్చినా.. ఏ హెయిర్ ఆయిల్ వాడినా.. కొందరికి జుట్టు రాలడం మాత్రం ఆగదు. అదే కాదు చుండ్రు, చిట్లడం వంటి పలు సమస్యలు కూడా తగ్గవు. దీంతో చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడేవారు సహజ సిద్ధంగా ఇంట్లోనే తయారు చేసిన ఉల్లి నూనెను వాడితే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, ఉల్లి నూనెను ఎలా తయారు చేసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- కొబ్బరినూనె- అరకప్పు
- కరివేపాకు - 20 రెబ్బలు
- మెంతులు - టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ- 1 (మీడియం సైజ్)
తయారీ విధానం:
- ముందుగా మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి. ఒకవేళ మీడియం సైజ్ లేకపోతే చిన్నవి రెండు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆన్ చేసిన ఓ మందపాటి పాత్ర పెట్టి అందులో పైన చెప్పిన విధంగా కొబ్బరినూనె, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
- బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మీడియం మంట మీద సుమారు అరగంట పాటు మరగించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉల్లి, మెంతులు,కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ నూనెలోకి చేరతాయి.
- నూనె మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన పెట్టాలి. ఆపై ఒక శుభ్రమైన క్లాత్ సహాయంతో ఆ నూనెను వడకట్టుకోవాలి. అనంతరం దాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని.. కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు.