Bangladesh Second Independence :పాలనాపగ్గాలు మారిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్లయిందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాత్కాలిక ప్రభుత్వ సారథి, నోబెల్ పురస్కార గ్రహీత ముహమ్మద్ యూనుస్ పిలుపునిచ్చారు. పౌరుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని, వారిపై దాడుల్ని ఆపడం ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా గురువారం రాత్రి ఆయన చేత అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి హోదాకు సమానమైన ముఖ్య సలహాదారుగా యూనుస్ వ్యవహరిస్తారు. పారిస్ నుంచి మధ్యాహ్నం ఢాకా చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తొలుత ఆయన విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. దాడులు, అల్లర్లకు అడ్డుకట్టవేసి దేశ పునర్నిర్మాణాన్ని చేపట్టాలని, దాని కోసం ప్రజలు తనకు సహకరించాలని కోరారు. షేక్ హసీనాను గద్దె దించేలా నిరసన ఉద్యమం నడిపారంటూ విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మీరు మాట వినకపోతే - నేనేం చేయలేను
'ఈ రోజు మనకెంతో గర్వకారణం. అరాచక కార్యకలాపాలను, మైనారిటీలపై దాడుల్ని నిలువరించి, శాంతి, భద్రతల్ని పునరుద్ధరించడం మన మొదటి కర్తవ్యం. ఈ దాడులన్నీ ఓ కుట్రలో భాగం. విద్యార్థులు, యువత కోరితే పాలనా పగ్గాలు చేపట్టడానికి నేను ముందుకు వచ్చాను. ప్రజలందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎవరిపైనా, ఎక్కడా, ఎలాంటి దాడులు జరగడానికి వీల్లేదు. దీనిని మనం సాధించలేకపోతే, మీరు నా మాట వినకపోతే, ఇక్కడ నా ఉపయోగమే ఉండదు' అని యూనుస్ నిష్కర్షగా తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ ఇప్పుడు యువత చేతిలో ఉన్నందువల్ల వారి ఆకాంక్షలు, సృజనకు తగ్గట్టుగా పునర్నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉందన్నారు. 16 మందితో సలహాదారుల మండలిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో విద్యార్థి ఉద్యమ నేతలు, సామాజిక ఉద్యమకర్తలు కూడా ఉన్నారు. యూనుస్‌ను భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. బంగ్లాదేశ్‌లో త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.