తెలంగాణ

telangana

ETV Bharat / international

300 కిలోల గోల్డ్ బార్​- వరల్డ్ రికార్డ్ బ్రేక్- రేట్ ఎంతో తెలుసా? - WORLD LARGEST GOLD BAR IN DUBAI

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు కడ్డీని ఆవిష్కరించిన దుబాయ్- జపాన్ రికార్డు బ్రేక్- ధర ఎంతంటే?

WORLD LARGEST GOLD BAR
300 కిలోల గోల్డ్ బార్​ (AFP)

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2024, 3:58 PM IST

World'S Biggest Gold Bar : ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛమైన బంగారు కడ్డీని (గోల్డ్ బార్​ను) దుబాయ్​లో ఆవిష్కరించారు. ఈ కడ్డీ బరువు ఏకంగా 300.12కిలోలు. ప్రపంచంలోనే అత్యధిక బరువున్న బంగారు కడ్డీగా ఈ గోల్డ్ బార్ గిన్నిస్ వరల్డ్ రికాడ్స్​లో చోటు సంపాదించుకుంది. ఈ బంగారు కడ్డీ ధర భారత కరెన్సీలో అక్షరాలా రూ.211 కోట్లు.

జపాన్ రికార్డ్ బ్రేక్
ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ ఎల్ఎల్​సీ ఈ భారీ బంగారు కడ్డీని తయారు చేసింది. ఈ గోల్డ్ బార్​ను దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్​టెన్షన్​లో శనివారం ప్రదర్శించారు. గతంలో అత్యధిక బరువున్న(250కిలోలు) బంగారు కడ్డీని తయారు చేసిన రికార్డు జపాన్‌ పేరిట ఉండేది. తాజాగా 300కిలోల గోల్డ్ బార్​ను తయారుచేసి దుబాయ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.

దాదాపు 10 గంటలు శ్రమ
"300 కిలోల గోల్డ్ బార్​ను తయారు చేయడానికి 8-10 గంటల సమయం పట్టింది. బంగారు కడ్డీని నిర్ణీత ప్రమాణాల ప్రకారం తయారు చేశాం. మేము తయారు చేసింది 300 కిలోల బంగారు కడ్డీ అని నిర్ధరించుకోవడానికి ప్రతిదీ కచ్చితంగా డాక్యుమెంట్ చేశాం. వాటినే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్​కు పంపించాం. బంగారు కడ్డీ విలువ సుమారు 25 మిలియన్ డాలర్లు(93 మిలియన్ యూఏఈ దిర్హామ్‌లు)" అని ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ ఎల్ఎల్​సీ డిప్యూటీ జనరల్ మేనేజర్ మహమ్మద్ ఖర్సా తెలిపారు.

300 కిలోల గోల్డ్ బార్​ (AFP)

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌ సైట్​లో- "ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ ఎల్ఎల్​సీ యూఏఈ వారసత్వానికి గౌరవసూచకంగా భారీ బంగారు కడ్డీని తయారు చేసింది. ప్రపంచంలోనే స్వచ్ఛమైన అతి పెద్ద బంగారు కడ్డీని నిబద్ధతతో ఆవిష్కరించింది. ఈ విజయం ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ ఎల్ఎల్​సీ అంకితభావం, కచ్చితమైన ప్రణాళిక, గొప్పతనాన్ని తెలియజేస్తుంది." అని పేర్కొన్నారు.

బంగారు కడ్డీతో సెల్ఫీలు
మింటింగ్ ఫ్యాక్టరీ దుకాణం వెలుపల గాజు పెట్టెలో బంగారు కడ్డీని భద్రపరిచారు. దీన్ని చూసేందుకు సందర్శకులు పోటెత్తారు. అనేక మంది సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

భారత్​లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?
దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 78,520 ఉండగా, ఆదివారం నాటికి రూ.30 తగ్గి రూ.78,490కి చేరుకుంది. కిలో వెండి ధర శనివారం రూ.92,978 ఉండగా, ఆదివారం నాటికి అంతే మొత్తంలో ఉంది.

ABOUT THE AUTHOR

...view details