తెలంగాణ

telangana

ETV Bharat / international

'వరల్డ్ వార్​ 3 మొదలైనట్లే' - ఉక్రెయిన్‌ మాజీ జనరల్‌ - WORLD WAR 3 HAS BEGUN

ముదిరిన రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం - ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?

World War 3
World War 3 (AP)

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 8:44 PM IST

World War 3 Has Begun : రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరాటం మరింత ఉద్రిక్తం అవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ మాజీ జనరల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైందని ఆయన పేర్కొన్నారు. తామిచ్చిన దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాలోకి ప్రయోగించేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చింది. దీనితో రష్యా తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే తమ అణ్వాయుధ ప్రయోగ సిద్ధాంతాన్ని మరింత సరళతరం చేసింది. పైగా ఉక్రెయిన్​పైకి మధ్యంతర శ్రేణి క్షిపణి (ఓరెష్నిక్‌)ని ప్రయోగించింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళనలు చెలరేగుతున్నాయి. కానీ మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైందని ఉక్రెయిన్ సైన్యం మాజీ కమాండర్ చెప్పారు. రష్యా తరఫున ఉత్తర కొరియా సైన్యం బరిలోకిదిగడం, ఇరాన్ తయారీ డ్రోన్లు మాస్కో వాడడమే ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు.

రష్యా దూకుడు
ఉక్రెయిన్‌-రష్యా మధ్య క్షిపణి ప్రయోగాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా దూకుడుగా చర్యలు తీసుకుంటుండగా, రష్యా మరింత దూకుడు చర్యలు తీసుకుంటోంది. దీనితో ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ సైన్యం మాజీ కమాండర్ ఇన్ చీఫ్ జలుజ్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు భావిస్తున్నానని అన్నారు. యుద్ధంలో రష్యా మిత్రదేశాలు పాల్గొనడం ఇదే విషయాన్ని సూచిస్తోందన్నారు. ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్‌పై పోరాడుతున్నారని ఆయన చెప్పారు. ఇరాన్‌ రూపొందించిన డ్రోన్లను రష్యా ప్రయోగిస్తుండటంతో ఉక్రెయిన్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఉత్తర కొరియా దళాలు, ఇరాన్‌ ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. బ్రిటన్‌లో ఉక్రెయిన్‌ రాయబారిగా ఉన్న ఆయన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్​కు మిత్రదేశాల సహకారం!
తాజా సంక్షోభం మరింత విస్తరించకుండా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్‌ మిత్రదేశాలకు జలుజ్ని విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్రిక్తతలను ఇక్కడితో ఆపడం సాధ్యమేనన్న ఆయన, కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్య పక్షాలు దీనిని అర్థం చేసుకోవడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు ఇప్పటికే అనేక మంది శత్రువులు ఉన్నారన్న మాట వాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒంటరిగా యుద్ధంలో తమ దేశం గెలవడంపై అనుమానాలు ఉన్నాయని జలుజ్ని అన్నారు. కాగా ఈ ఏడాది మొదట్లో అభిప్రాయ భేదాలతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, జలుజ్నిని కమాండ్ ఇన్ చీఫ్ పదవి నుంచి తొలగించడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details