తెలంగాణ

telangana

మోదీ రాక కోసమే వెయిటింగ్- భేటీకి నేను రెడీ: పుతిన్ - Putin On Modi

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 7:12 AM IST

Putin On Modi : బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ రష్యాకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Putin On Modi
Putin On Modi (Associated Press)

Putin On Modi :బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ అక్టోబరులో రష్యాకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. ఆయన రాక కోసం తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. బ్రిక్స్‌ దేశాల జాతీయ భద్రత సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) సమావేశంలో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లిన భారత ఎన్‌ఎస్‌ఏ అజీత్‌ డోభాల్‌ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పుతిన్‌తో గురువారం భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. రష్యాలోని కజన్‌ వేదికగా వచ్చే నెల 22 నుంచి 24 వరకు జరిగే బ్రిక్స్‌ సదస్సుకు మోదీ వస్తే, ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు డోభాల్‌తో పుతిన్‌ చెప్పారు.

షోయిగుతో కూడా డోభాల్‌ భేటీ
గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని అజీత్ డోభాల్‌ పుతిన్‌కు వివరించారు. మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ డోభాల్‌ పుతిన్‌కు వివరించారు. జులైలో జరిపిన ద్వైపాక్షిక చర్చల పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారని డోభాల్ పుతిన్‌కు చెప్పారు. రష్యా జాతీయ భద్రతా సలహాదారుడు సెర్గీ షోయిగుతో కూడా డోభాల్‌ భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలు ఉన్న అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్లు రష్యాలోని భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన పర్యటనకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

అటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో కూడా అజీత్ డోభాల్ సమావేశమయ్యారు. తూర్పు లద్ధాఖ్‌లో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలంటే సరిహద్దుల్లో శాంతి అత్యవసరమని డోభాల్‌, వాంగ్‌ యీతో చెప్పినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. వాస్తవాధీన రేఖను గౌరవించాలని డోభాల్ చైనా విదేశాంగ మంత్రికి సూచించినట్లు తెలిపింది. తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలిగించేందుకు ఇటీవల చేసిన ప్రయత్నాలను ఇరువురు సమీక్షించారని వెల్లడించింది. ప్రాంతీయ పరిస్థితులతో పాటు ప్రపంచ భౌగోళిక అంశాలపైనా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details