Us Visa Record In India : 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అన్ని వీసా విభాగాల్లో డిమాండ్ భారీగా ఉందని వెల్లడించింది. 2022తో పోలిస్తే గతేడాది భారతీయుల వీసా దరఖాస్తుల్లో 60 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది అగ్రరాజ్య వీసా దరఖాస్తుదారుల్లో ఒకరు భారతీయులేనని పేర్కొంది. విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ వేచి చూసే సమయాన్ని 75 శాతం (సగటున 1000 రోజుల నుంచి 250కి) తగ్గించినట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అత్యధికంగా భారతీయ విద్యార్థులే
భారత్‌లోని అమెరికా దౌత్య బృందం 2023లో 1.40 లక్షలకుపైగా విద్యార్థి వీసాలు జారీ చేసి వరుసగా మూడో ఏడాది రికార్డు సృష్టించింది. మరే దేశంలోనూ ఈ స్థాయిలో జారీ చేయలేదని అమెరికా తెలిపింది. విద్యార్థి వీసా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ముంబయి, దిల్లీ, హైదరాబాద్, చెన్నైలు ప్రపంచంలోనే మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం అమెరికాలో విద్యనభ్యసిస్తోన్న పది లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థుల్లో నాలుగింట ఒకవంతు భారతీయులే ఉన్నారని పేర్కొంది. అలానే భారతీయులు, వారి కుటుంబ సభ్యుల కోసం గతేడాది 3.80 లక్షల ఉద్యోగ వీసాలు జారీ చేసినట్లు అమెరికా తెలిపింది. విజిటర్ వీసాల(బీ1/బీ2)కు సంబంధించి మొత్తం 7 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. కొవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైన 31 వేలకుపైగా వలస వీసా దరఖాస్తులను ముంబయిలోని కాన్సులేట్ జనరల్ పరిష్కరించినట్లు అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.