US Stopped Bomb Supply To Israel :దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో అమెరికా బిక్ షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. సరఫరా చేయాల్సిన వాటిలో 2000 పౌండ్ల బరువైన 1800, 500 పౌండ్ల బరువైన 1700 బాంబులు ఉన్నాయి. భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే ఈ బాంబులను సరఫరా చేస్తే, రఫాపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా వీటి సరఫరాను ఆపినట్లు సమాచారం. దీన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా ధ్రువీకరించారు. తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తామని, కానీ రఫాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గత వారం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం దాదాపు 13 నుంచి 14 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకుంటున్నారు. ఈ నగరంపై దాడి చేస్తే భారీ మానవ సంక్షోభం తప్పదని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ విషయాన్ని అనేక సార్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అయినా ఆ మాటలను ఇజ్రాయెల్ ఖాతరు చేయడంలేదు. అమెరికా సహా ఎవరూ తమను ఆపలేరని నెతన్యాహు బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు. అమెరికా ఎంతగా నచ్చచెబుతున్నా, రఫాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ అంటోంది. ఒక వేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, రఫాలోని హమాస్‌ను నాశనం చేస్తామని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా బాంబుల సరఫరా నిలిపివేసింది. కాగా, ఇది అంత పెద్ద విషయం కాదని, అమెరికాతో మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ఇజ్రాయెల్ చెబుతోంది.