తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజాలో ఆకలి కేకలు- విమానాల ద్వారా ఆహారం జారవిడిచిన అమెరికా

US Military Airdrop Food In Gaza : గాజాలో ఆకలి కేకలు మిన్నంటడం వల్ల అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల ద్వారా మానవతా సాయాన్ని గాజాలోని పలుప్రాంతాల్లో జారవిడిచింది. ఇది నిరంతర ప్రక్రియ అని శ్వేతసౌధం ప్రతినిధి ఒకరు తెలిపారు.

US Military Airdrop Food In Gaza
US Military Airdrop Food In Gaza

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 9:56 AM IST

US Military Airdrop Food In Gaza :ఆకలితో అల్లాడుతున్న గాజా వాసులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది. మూడు సీ-130 సైనిక రవాణా విమానాల సాయంతో మొదటిసారి దాదాపు 38 వేల ఆహార పొట్లాలను జారవిడిచింది. జోర్డాన్‌ సమన్వయంతో ఆహార పొట్లాల పంపిణీ ప్రారంభించారు. ఇజ్రాయెల్‌ భీకర దాడులతో గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్న వేళ, గాజావాసులకు ఉపశమనం కల్పించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నిరంతర ప్రక్రియ అని శ్వేతసౌధం ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ల్యాండింగ్‌, దాదాపు 19 టన్నుల బరువు మోసుకెళ్లగల సామర్థ్యం కారణంగా మారుమూల ప్రాంతాలకు సహాయక సామగ్రి చేరవేతలో 'సీ-130' విమానాలను అమెరికా విస్తృతంగా ఉపయోగిస్తోంది. గతంలో అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌ తదితర దేశాల్లో సహాయ కార్యక్రమాలకు వినియోగించింది.

'గాజాకు మరింత సాయం కావాలి'
'ఈ క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరం. దాన్ని అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. గాజాకు ఇప్పుడు అందించే మానవతా సాయం సరిపోదు. మరింత సహాయం చేయడానికి మాకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం.' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం తెలిపారు.

ఇజ్రాయెల్ దాడిలో 100మందికి పైగా మృతి
Israel Attack On Palestine : ఇటీవల ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడుల్లో మానవతా సహాయం కోసం ఎదురుచూస్తున్న 100 మందికిపైగా మంది మృతి చెందారు. దాదాపు 300 మంది దాకా గాయపడ్డారని గాజాలోని వైద్యులు తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో నేలపై పడి ఉన్న డజన్లకొద్దీ మృతదేహాలను వైద్యులు చూశారని కమల్ అద్వాన్ ఆస్పత్రిలోని అంబులెన్స్​ సేవల హెట్​ ఫేర్స్​ అఫానా చెప్పారు. క్షతగాత్రులు, మృతదేహాలను తీసుకెళ్లేందుకు సరిపడా అంబులెన్స్​లు లేక, కొందరిని గాడిద బండ్లపై ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందించడానికి కూడా సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆస్పత్రుల్లో విద్యుత్​ ఉండటం లేదు. బ్యాటరీ పవర్​తో ఆపరేషన్​ థియేటర్​ను నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది.

గాజాలో 30వేలు దాటిన మరణాలు
ఇజ్రాయెల్-హమాస్​ యుద్ధం మొదలైన తర్వాత గాజాలో 30వేల మందికిపైగా చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. గతేడాది అక్టోబర్​ 7న ఇజ్రాయెల్​పై హమాస్​ అనూహ్య దాడులు జరిపింది. ఈ దాడుల్లో వందలాది ఇజ్రాయెల్ పౌరులు సహా ఇతర దేశాల పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్, గాజాపై క్షిపణులతో విరుచుకుపడింది. గాజా సిటీ, సహా ఉత్తర గాజాను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. అప్పటి నుంచి హమాస్ మిలిటెంట్లు, వారు నక్కిన సొరంగాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో గాజాలో తీవ్ర మానవ సంక్షోభం నెలకొంది.

ప్రపంచంలో 100కోట్లు దాటిన ఊబకాయులు- ప్రతి 8మందిలో ఒకరికి సమస్య- భారత్​లో కోటికిపైనే!

రెస్టారెంట్​లో చెలరేగిన మంటలు- 45మంది మృతి

ABOUT THE AUTHOR

...view details