Panama Canal Trump Issue : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో పంతం నెగ్గించుకున్నారు!. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సె వెల్లడించారు. ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు.
అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని మెచ్చుకొన్నారు. ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది. అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొంది. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకొంది.
ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి!
అయితే నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ట్రంప్ పనామా కెనాల్‌ను తిరిగి స్వాధీనం చేసుకొంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలైంది.
అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి. ఇక్కడ చైనాకు చెందిన సంస్థలు ఇక్కడి ఓడరేవుల్లోనే పెట్టుబడి పెట్టడాన్ని ట్రంప్‌తో సహా ఆయన విదేశాంగ మంత్రి రూబియో కూడా తప్పుపట్టారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక తాము చైనాకు చెందిన బీఆర్‌ఐ ప్రాజెక్టులోని కాంట్రాక్టులు పునరుద్ధరించుకోమని పనామా అధ్యక్షుడు జాస్ రౌల్ మోలినో హామీ ఇచ్చారు. ట్రంప్ ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నా ఆ దేశం కొన్నింటికి అంగీకరించడం వల్ల కొంత మెత్తబడ్డారు.
నౌకాయాన భారం తగ్గిస్తూ అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కాలువను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది. కానీ, పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడం వల్ల 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ కాలువను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకొన్నారు. ఈ కెనాల్ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా కాలువ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది.