తెలంగాణ

telangana

ETV Bharat / international

బరిలో ట్రంప్, కమలే కాదు- అనేక చోట్ల 'మూడో' మనిషి కూడా- ఎవరికి ప్లస్​? మైనస్​?

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్ ట్రంప్​, కమలా హారిస్​తోపాటు మరికొందరు- స్వింగ్‌ రాష్ట్రాలన్నింటా అనేక మంది పోటీ!

US Election 2024
US Election 2024 (AP (Associated Press))

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

US Election 2024 Independent Candidates :అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనగానే రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీలు మాత్రమే రంగంలో ఉన్నాయని అందరూ అనుకుంటాం! పోరు ప్రధానంగా ఆ రెండు పార్టీల అభ్యర్థుల మధ్యే అయినా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉండొచ్చు. ఈసారీ అదే జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్​, కమలా హారిస్​తోపాటు మరికొందరు ఈసారి ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్న స్వింగ్‌ రాష్ట్రాలన్నింటా మూడో పార్టీ అభ్యర్థో, స్వతంత్ర అభ్యర్థో బ్యాలెట్‌ పేపర్లపై ఉన్నారు.

మిషిగన్, విస్కాన్సిన్‌లో మాజీ అధ్యక్షుడు కెనెడీ వారసుడు రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ్రీన్‌ పార్టీ తరఫున జిల్‌ స్టెయిన్‌ ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లో బరిలో దిగారు. లిబర్టేరియన్‌ పార్టీ తరఫున ఛేస్‌ ఒలీవర్‌ అన్ని స్వింగ్‌ రాష్ట్రాల్లో రంగంలో ఉండగా, స్వతంత్ర అభ్యర్థి కార్నల్‌ వెస్ట్‌ మిషిగన్, నార్త్‌ కరోలినా, విస్కాన్సిన్‌లలో పోటీలో నిలిచారు. కీలకమైన స్వింగ్‌రాష్ట్రాల్లో వీరు బరిలో నిలవటం రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

వాస్తవానికి స్వతంత్ర అభ్యర్థులు నెగ్గే అవకాశాలు లేకున్నా, ప్రధాన పార్టీల అవకాశాల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. పైగా ఈసారి ఎన్నికల్లో ట్రంప్, హారిస్‌ మధ్య ఉత్కంఠభరిత పోరు నెలకొంది. అన్ని సర్వేల్లో కూడా ముఖ్యంగా స్వింగ్‌ రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఒకట్రెండు శాతం ఓట్లు కూడా ఎంతో కీలకం కాబోతున్నాయి. వాటికి ఈ మూడో అభ్యర్థి గండి కొట్టే ప్రమాదం లేకపోలేదు.

గ్రీన్‌పార్టీ అభ్యర్థి జిల్‌ స్టెయిన్, లిబర్టేరియన్‌ పార్టీ అభ్యర్థి ఛేస్‌ ఒలీవర్‌కు దేశవ్యాప్తంగా చెరోశాతం ఓట్లు పడతాయని న్యూయార్క్‌టైమ్స్‌ ఇటీవలి సర్వే అంచనా వేసింది. అదే జరిగితే వివిధ రాష్ట్రాల్లో ప్రధాన అభ్యర్థులకు దెబ్బ తగిలే అవకాశాలుంటాయి. అధ్యక్ష ఎన్నికకు అవసరమైన ఎలక్టోరల్‌ కాలేజీ సీట్లు ప్రభావితం అవుతాయి. గ్రీన్‌పార్టీ అభ్యర్థి జిల్‌ స్టెయిన్‌ స్వింగ్‌ రాష్ట్రాలతో పాటు 38 రాష్ట్రాల్లో పోటీలో ఉన్నారు. ఆమె విషయంలోనే డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. అందుకే స్టెయిన్‌కు వ్యతిరేకంగా ప్రత్యేకంగా టెలివిజన్‌ ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు.

స్టెయిన్‌కు ఓటంటే ట్రంప్‌కు ఓటే అంటూ కమలా హారిస్‌ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన విస్కాన్సిన్‌లో స్టెయిన్‌ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నది డెమోక్రాట్ల భావన. 2016లో కూడా స్టెయిన్‌కు విస్కాన్సిన్‌లో 31వేలకుపైగా ఓట్లు వచ్చాయి. నాడు అక్కడ హిల్లరీ క్లింటన్‌ ఓటమికి స్టెయిన్‌ కారణంగా చెబుతారు. అరబ్‌ ముస్లింలు ఎక్కువగా ఉన్న మిషిగన్‌లాంటి చోట హారిస్‌ ఓట్లకు స్టెయిన్‌ గండికొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో అరబ్‌ అమెరికన్‌ ఓటర్లు బైడెన్‌పార్టీపై అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఈ కారణాలతోనే డెమోక్రాట్లు మొదటి నుంచీ ఈ మూడో అభ్యర్థుల నామినేషన్లే తిరస్కరించేలా ఒత్తిడి తెచ్చారు. అది కుదరకపోవడం వల్ల ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ప్రచారాన్ని పెంచుతున్నారు. మరోవైపు స్టెయిన్‌ లాంటి వారి పోటీని ట్రంప్‌ సమర్థిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి కెనడీ సైతం కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్‌నకు మద్దతుగా పోటీ నుంచి విరమించుకోవటం గమనార్హం.

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details