తెలంగాణ

telangana

ETV Bharat / international

స్వింగ్‌ స్టేట్స్‌లో కింగ్‌గా నిలిచిన ట్రంప్‌ - 7 రాష్ట్రాల్లోనూ ఆయనదే హవా!

స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ హవా - పూర్తిగా వెనుకబడిన కమలా హారిస్ - కారణాలివే!

Trump
Trump (AP)

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 7:49 PM IST

US Election Results In Swing States :అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నిర్ణయించే స్వింగ్‌ రాష్ట్రాల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ కింగ్‌గా నిలిచారు. 7 స్వింగ్‌ రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా అవన్నీ ట్రంప్‌ ఖాతాలోకే చేరుతున్నాయి. పెన్సిల్వేనియా, నార్త్‌కరోలినా, జార్జియా, విస్కాన్సిన్‌లో జయభేరి మోగించిన ట్రంప్‌ మరో మూడు స్వింగ్‌ రాష్ట్రాల్లోనూ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు.

స్వింగ్​ స్టేట్స్​ ప్రత్యేకత ఇదే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మూడు రకాల రాష్ట్రాలు ఉంటాయి. రిపబ్లికన్లవైపు మొగ్గు చూపేవాటిని రెడ్‌ స్టేట్స్‌గా, డెమోక్రాట్ల వైపు నిలిచేవి బ్లూ స్టేట్స్‌గా అభివర్ణిస్తారు. స్వింగ్‌ స్టేట్స్‌లో మాత్రం ఫలితాలు ఇరుపార్టీల మధ్య దోబూచులాడుతుంటాయి. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలాంటి స్వింగ్‌ స్టేట్స్‌ 7 ఉండగా అన్నింటిలోనూ ట్రంప్‌ జోరు కొనసాగింది. స్వింగ్‌ స్టేట్స్‌లో అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియా ట్రంప్‌ వశమైంది. 19 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో తొలుత డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, కొద్దిసేపటికే రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ పుంజుకొని ఆమెను దాటేశారు. ఇక్కడ పాపులర్‌ ఓట్‌లో ట్రంప్‌ 1,75,000కుపైగా ఓట్లు సాధించారు. ఈ రాష్ట్రంలోనే ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. సమకాలీన ఎన్నికల్లో పెన్సిల్వేనియా ఏడుసార్లు డెమోక్రటిక్‌ అభ్యర్థికి, ఆరుసార్లు రిపబ్లికన్లకు మొగ్గు చూపింది.

మరోసారి ట్రంప్​నకే పట్టం
2016, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పక్షాన నిలిచిన ఏకైక స్వింగ్‌ రాష్ట్రం నార్త్‌కరోలినా మరోసారి ఆయనకే పట్టం కట్టింది.1980 తర్వాత కేవలం ఒకేసారి ఈ రాష్ట్రం డెమోక్రాట్లకు ఓటేసింది. ఇక్కడ ఆఫ్రో అమెరికన్‌ ఓటర్లు దాదాపు 22శాతం దాకా ఉన్నారు. ఇటీవల హెలెన్‌ తుపాను కారణంగా నార్త్‌ కరోలినాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దీని ప్రభావం డెమోక్రాట్లపై పడింది. నార్త్‌ కరోలినాలో దాదాపు 2 లక్షల ఓట్ల మెజార్టీని ట్రంప్‌ దక్కించుకున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న 16 ఎలక్టోరల్‌ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఆఫ్రో-అమెరికన్లు ఎక్కువగా ఉండే జార్జియాలో కూడా ట్రంప్‌ విజయఢంకా మోగించారు. అక్కడ ఉన్న 16 ఎలక్టోరల్‌ ఓట్లను దక్కించుకున్నారు. జార్జియాలో ట్రంప్‌నకు 50.8 శాతం, కమలా హారిస్‌కు 48.5 శాతం ఓట్లు దక్కాయి.

ఎదురులేదు!
విస్కాన్సిన్‌లో 10 ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా అవన్నీ ట్రంప్‌ ఖాతాలోకే చేరాయి. ఇక్కడ కూడా మొదటి నుంచి రిపబ్లికన్లకు అనుకూలంగానే ఉంది. 41 వేల ఓట్లకుపైగా మెజార్టీ ట్రంప్‌నకు లభించింది, రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సదస్సును కూడా ఈసారి విస్కాన్సిన్‌లోనే నిర్వహించారు. అరబ్‌-అమెరికన్‌ ఓటర్లు ఎక్కువగా ఉన్న మిషిగన్‌లో 15 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. మొదటి నుంచి ఇక్కడ డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధిక్యం కొనసాగింది. గాజా-పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతివ్వటాన్ని అరబ్‌ అమెరికన్లు హర్షించటం లేదు. ఆ ప్రభావం ఫలితాలపై పడింది. మెక్సికోతో సుదీర్ఘ సరిహద్దుగల ఆరిజోనా రాష్ట్రంలో కూడా ట్రంప్‌దే పైచేయి అయ్యింది. 11 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న ఆరిజోనాలో హారిస్‌ కంటే ట్రంప్‌ లక్షకుపైగా ఓట్లు సాధించారు. సరిహద్దుల్లోంచి అక్రమంగా వస్తున్న వలసలు, వాటితో తలెత్తుతున్న సమస్యలను ఇక్కడ ట్రంప్‌ అస్త్రంగా మలచుకున్నారు. 2004 నుంచి రిపబ్లికన్‌ అభ్యర్థిని ఎంచుకోని నెవడాలో కూడా ట్రంప్‌ జోరు కనబర్చారు.

ABOUT THE AUTHOR

...view details