US Bridge Collapse Death Toll : అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను కార్గో షిప్ ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు కార్మికులు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో షిప్‌లోని భారతీయ సిబ్బంది అంతా క్షేమమని షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీ సినర్జీ ప్రకటించింది. అందులో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. ఇద్దరు పైలట్లు సహా అందరిని గుర్తించినట్లు చెప్పింది. అమెరికా కాలమాన ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
సింగపూర్‌కు చెందిన గ్రీస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్గోనౌక దాలీ బాల్టిమోర్ నుంచి కొలంబోకు బయలుదేరింది. మంగళవారం ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వంతెన కుప్పకూలగా, ఆ సమయంలో దానిపై వెళ్తున్న పలు కార్లు, ఇతర వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరిని అధికారులు సురక్షితంగా కాపాడారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు వంతెనను ఢీకొన్న నౌకలో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం గురించి నౌకాసిబ్బంది ముందుగా హెచ్చరించడం వల్ల భారీ ముప్పు తప్పిందన్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టిన అమెరికా నౌకా సిబ్బంది పూర్తిగా సహకరిస్తున్నారని వెల్లడించింది.
తాత్కాలికంగా సహాయక చర్యలు నిలిపివేత
మరోవైపు ఈ ప్రమాద నేపథ్యంలో మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫెడరల్ ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. ఎఫ్‌బీఐ ఘటనా స్థలికి చేరుకుందని, అయితే ఉగ్రవాద కోణంలో ఆధారాలేమీ లభించలేదని వారు తెలిపారు. అలాగే ప్రస్తుతానికి సహాయక చర్యలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు.