Iran-backed Attack On Israel : ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయనుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా సాగిపోతున్నాయని తెలిపింది. ఇంతవరకు ఘర్షణ వాతావరణం వరకే పరిమితమైన ఉద్రిక్తత పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత హనియె హత్యానంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
పశ్చిమాసియాకు అమెరికా అణు జలాంతర్గామి
అటు తాజా పరిస్థితుల తీవ్రతను గుర్తించి అమెరికా అప్రమత్తమైంది. పశ్చిమాసియాకు అణు జలాంతర్గామిని పంపుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బయల్దేరిన అబ్రహం లింకన్ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు వేగంగా చేరుకోవాలని పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ రక్షణకు కట్టుబడి ఉన్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్‌తో
ఆస్టిన్ ఆదివారం రెండుసార్లు ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆస్టిన్ తెలిపారు. రానున్న 24 గంటల్లోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్, లెబనాన్‌లు దాడి చేయనున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి.
సంయమనం పాటించండి ప్లీజ్
ఇరాన్ సంయమనం పాటించాలని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు కోరాయి. అమెరికా, ఖతర్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రతిపాదనను అవి సమర్థించాయి. గాజాలో 10 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చాయి. తన దగ్గర ఉన్న బందీలను హమాస్ విడిచిపెట్టాలని ఎలాంటి ఆంక్షలు లేని మానవతా సాయం గాజాకు చేరేలా ఇజ్రాయెల్ అనుమతించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.