US Attack On Houthi Rebels : ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్‌కు చెందిన సైన్యం మరోసారి విరుచుకుపడింది. యెమెన్‌లోని వారి స్థావరాలే లక్ష్యంగా శనివారం మరోసారి దాడులు నిర్వహించినట్లు డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఈ విషయంలో మిత్రదేశాలైన ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, డెన్మార్క్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ దేశాలు కూడా తమకు సహకరించాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
"అమెరికా, యూకేకు చెందిన మిలిటరీ బలగాలు కలిసి యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై దాడులు జరిపాయి. ఈ సంయుక్త చర్య హౌతీలకు స్పష్టమైన హెచ్చరికలు పంపించిందని మేము భావిస్తున్నాము. అంతర్జాతీయ షిప్పింగ్‌పై వీరు చేస్తున్న అక్రమ దాడులను ఆపకపోతే, మున్ముందు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రం ఒకటి. ఇక్కడ జరుగుతున్న దాడులను మేము ఉపేక్షించబోము. దీంతో ముడిపడి ఉన్న జీవితాలను, వాణిజ్య స్వేచ్ఛను రక్షించడానికి మేము వెనుకాడము."
- లాయిడ్ ఆస్టిన్, డిఫెన్స్ సెక్రటరీ
పెద్ద ఎత్తున ఆయుధాల నిల్వలు!
ఎర్ర సముద్రంలో చట్టబద్ధంగా సరకు రవాణా చేస్తున్న అమెరికా సహా అంతర్జాతీయ నౌకలపై ఇరాన్ మద్దతిస్తున్న హౌతీల దాడులను తాము చేపట్టిన ఈ సంయుక్త దాడులు ఆపుతాయన్నారు ఆస్టిన్. అంతేకాకుండా వారి శక్తి సామర్థ్యాలను ఈ చర్య మరింత దెబ్బతీస్తుందని ఆస్టిన్ అన్నారు. 13 ప్రాంతాల్లోని 36 హౌతీల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులను నిర్వహించినట్లుగా యూఎస్, యూకే కలిసి విడుదల చేసిన ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఈ స్థావరాల్లో హౌతీలు పెద్ద ఎత్తున ఆయుధాలని నిల్వ ఉంచినట్లుగా చెప్పారు. ఇందులో క్షిపణి వ్యవస్థలు, లాంఛర్లు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్లు ఉన్నట్లు ఆస్టిన్ వివరించారు.