UNSC Reforms India :ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను భారత్ నొక్కిచెప్పింది. లేదంటే సంస్థ విస్మరణకు గురవుతుందని హెచ్చరించింది. 2000 సంవత్సరంలో జరిగిన మిలినియం సమ్మిట్‌లోనే సంస్కరణలను ప్రతిపాదించారని, ఓ కార్యక్రమంలో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గుర్తు చేశారు. దాదాపు 25 ఏళ్లుగా ఈ అంశంపై చర్చలు కొనసాగడంపై అసహనం వ్యక్తం చేశారు. భద్రతా మండలి సంస్కరణల విషయంలో రాబోయే తరాలు ఇక ఏమాత్రం ఓపికపట్టలేవని కాంబోజ్ స్పష్టం చేశారు. వెంటనే సంస్కరణల దిశగా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా ఆఫ్రికా వంటి అన్యాయానికి గురైన ప్రాంతాలకు సముచిత స్థానం కల్పించాలని హితవు పలికారు.
'భద్రతా మండలిలో వెంటనే సంస్కరణలు చేపట్టాల్సిందే!'- UNOకు భారత్ వార్నింగ్ - unsc reforms india
UNSC Reforms India : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలపై దాదాపు 25 ఏళ్లుగా చర్చలు కొనసాగుతున్నాయని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గుర్తుచేశారు. భద్రతా మండలి సంస్కరణల విషయంలో రాబోయే తరాలు ఇక ఏమాత్రం ఓపికపట్టలేవని కాంబోజ్ స్పష్టం చేశారు.
Published : Mar 10, 2024, 2:53 PM IST
|Updated : Mar 10, 2024, 4:19 PM IST
'వీటో అధికారంతో సంస్కరణలను ఆపొద్దు'
సంస్కరణల పథంలో అర్హత కలిగిన గ్రూపులు, దేశాలను గుర్తించి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంబోజ్ సూచించారు. తద్వారా తప్పులను సరిదిద్దాలని కోరారు. భద్రతా మండలిని శాశ్వత సభ్యదేశాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల దాని కూర్పులో అసమానతలను మరింత పెంచుతుందని వివరించారు. వీటో అధికారాన్ని ఉపయోగించి సంస్కరణల ప్రక్రియను అడ్డుకోవద్దని కాంబోజ్ తెలిపారు. నిర్మాణాత్మక చర్చల కోసం మాత్రమే వీటో అధికారాన్ని వినియోగించాలని సూచించారు. కొత్తగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యుల చేరికపై వీటో అధికారాన్ని వినియోగించకూడదని ప్రతిపాదించారు.
భారత ప్రతిపాదనలకు జీ4లోని బ్రెజిల్, జర్మనీ, జపాన్ మద్దతు తెలిపాయి. 193 సభ్యదేశాల వైవిధ్యత ప్రతిబింబించేలా ఐరాస భద్రతా మండలి కూర్పు ఉండాలని నొక్కి చెప్పాయి. 1945 నుంచి అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సమీకరణాల్లో వచ్చిన మార్పులను భద్రతా మండలి ప్రతిబింబించడం లేదని భారత్ విమర్శిస్తోంది. శాశ్వత సభ్యత్వ హోదా కలిగిన ఐదు దేశాలు మిగతా ప్రపంచానికి నియమ నిబంధనలు బోధిస్తూ, వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తోంది. మండలిని సర్వామోదనీయ వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే దాన్ని సంస్కరించక తప్పదని తెలిపింది. ముఖ్యంగా శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను 26కు పెంచాలని చెబుతోంది. జీ4 దేశాలతోపాటు ఆఫ్రికా గ్రూపు సిఫార్సు చేసే రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేస్తోంది.