Russia Ukraine War :రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తొలిసారి రష్యా ప్రధాన భూభాగంలోకి దాదాపు 15 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులు చేసింది. దీంతో రష్యాలోని సరిహద్దు ప్రాంతమైన కస్క్ నుంచి ఇప్పటికే అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దాదాపు నాలుగు రోజులుగా ఇరు దేశాల మధ్య ఈ ప్రదేశంలోనే భీకరంగా దాడులు జరుగుతున్నాయి.
తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టు, సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. 22వ మెకనైజ్డ్‌బ్రిగేడ్‌కు చెందిన 15మంది కమాండర్లను చంపేందుకు వ్యూహాత్మక ఇస్కందర్ క్షిపణలను ఉపయోగించినట్లు వెల్లడించింది. కస్క్‌వైపు ఉక్రెయిన్ 1120 మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు సహా ఇతర కీలక యుద్ధ సామగ్రిని కోల్పోయిందని రష్యా పేర్కొంది. కస్క్‌నుంచి ఉక్రెయిన్‌బలగాలు మరింత ముందుకు చొచ్చుకెళ్లకుండా రష్యా బలగాలు నిరోధిస్తున్నాయని తెలిపింది. కస్క్‌ప్రాంతంలో ఉక్రెయిన్‌కు చెందిన 26 డ్రోన్‌లను నేలకూల్చినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌బలగాలు, యుద్ధ సామగ్రి లక్ష్యంగా SU-34 ఫైటర్‌జెట్‌బాంబులను జారవిడించిందని తెలిపింది.
అటు రష్యాకు చెందిన సహజ వాయువు క్షేత్రాన్ని, అనేక నౌకలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కస్క్ ప్రాంతంలో తమ బలగాలు దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి మీడియాకు తెలిపారు. తద్వారా రష్యాపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. కస్క్‌లో జరుగుతున్న దాడుల గురించి సైనిక ఉన్నతాధికారులతో చర్చించినట్లు వెల్లడించారు. నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ఒక మిలిటరీ గస్తీ బోట్‌సహా మూడు ఇతర నౌకలపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ నిఘా విభాగం తెలిపింది. రష్యా ఆధీనంలో ఉన్న సహజ వాయువు క్షేత్రంపై నావిక దళం సాయంతో దాడి చేశామని పేర్కొంది. అయితే ఈ దాడులపై రష్యా అధికారికంగా స్పందించలేదు.