UAE Hindu Temple Inauguration : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బాప్స్ ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామిమహారాజ్తో అబుదాబిలో మొదటి హిందూ రాతి ఆలయ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాప్స్ ఆలయాల్లో జరిగిన గ్లోబల్ హారతిలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో మోకరిల్లి భగవంతుడికి మోదీ నమస్కరించారు. మహంత్ స్వామి మహరాజ్ మోదీని ప్రత్యేక పూలమాలతో సత్కరించారు. ఆలయమంతా కలియతిరిగి పరిశీలించిన మోదీ, ఉపాలయాల్లోని దేవుళ్లను పూజించారు.
అంతకుముందు, దేవాలయ ప్రాంగణానికి విచ్చేసిన ప్రధాని మోదీకి సాధువులు స్వాగతం పలికారు. అక్కడికి పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చేరుకున్నారు. వారిందరికీ మోదీ అభివాదం చేస్తూ మందిర ప్రాంగణానికి చేరుకున్నారు. మోదీ మెడలో పూలదండ వేసి ఈశ్వరచరందాస్ స్వామి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. స్వామినారాయణ పాదాల వద్ద పూల రేకులను సమర్పించారు ప్రధాని మోదీ. మహంత్ స్వామిమహారాజ్ పాదాలకు నమస్కరించారు
"ప్రతి ఒక్కరి కోసం ఆలయాన్ని నిర్మించాం. దేవుడి దయ, అందరి సహకారం, అబుదాబి పాలకుల ఔదార్యం, సాధువుల ఆశీర్వాదం, ప్రధాని మోదీ సహకారంతో నిర్మాణం చేపట్టాం. ఆలయ ప్రారంభోత్సవం అందరికీ ఓ వేడుక లాంటిది" అని బాప్స్ స్వామినారాయణ్ మందిర్ సాధువు బ్రహ్మ విహారిదాస్ తెలిపారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు.
ఎన్నో ప్రత్యేకతలు!
అబుదాబిలో బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ నిర్మించిన ఈ హిందూ దేవాలయం అరబ్‌దేశాల్లో అతిపెద్ద ఆలయంగా పేరు సంపాదించుకుంది. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ హిందూ దేవాలయానికి ఏడు గోపురాలు ఉంటాయి. అరబ్ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. వేలాది మంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. 402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్చేయండి