Typhoon Yagi collapses busy bridge : వియత్నాంలో యాగి తుపాను విధ్వంసం సృష్టించింది. పలుచోట్ల ఘోర ప్రమాదాలు సంభవించాయి. ఉత్తర వియత్నాంలోని ఫుథో ప్రావిన్స్‌లో రెడ్ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, ట్రక్కులు, రెండు బైక్‌లు నీళ్లలో పడిపోయాయి. వెనక వస్తున్న మరికొందరు ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. కళ్ల ముందే వాహనాలు నదిలో పడిపోవడం వల్ల భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. నదిలో పడిపోయిన వారిలో ముగ్గుర్ని సహాయక సిబ్బంది కాపాడారు. మరో 13 మంది గల్లంతు కాగా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
విరిగిపడ్డ కొండచరియలు :మరో ప్రావిన్స్ కావో బాంగ్‌లో వరదలకు కొండచరియలు విరిగి 20 మందితో వెళ్తున్న ఓ బస్సుపై పడ్డాయి. ఈ ఘటనలో ఆ బస్సు పక్కనున్న ప్రవాహంలో కొట్టుకుపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ మార్గమధ్యలో కొండచరియలు విరిగిపడం వల్ల ఘటనాస్థలికి చేరుకోలేకపోయాయి. హెలికాప్టర్ల ద్వారా ఘటనాస్థలికి రెస్క్యూ సిబ్బందిని తరలించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది.