US Elections Trump Arizona : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన ఆరిజోనాను రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ఏడు స్వింగ్ రాష్ట్రాలు ట్రంప్ వశమయ్యాయి. అరిజోనాలోని 11 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ దక్కించుకోవడం వల్ల ఆయనకు వచ్చిన ఓట్లు 312కు చేరాయి. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. 2020 ఎన్నికల్లో డెమొక్రట్ల నుంచి ఆరిజోనాను గెలుచుకున్న వ్యక్తిగా జో బైడెన్ నిలిచారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దక్కించుకున్నారు.
ట్రంప్ దూకుడు
2020 అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఆరింటిని జో బైడెన్ గెలుచుకున్నారు. ఒక్క నార్త్ కరోలినా మాత్రమే ట్రంప్ దక్కించుకున్నారు. కానీ 2024 అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం ట్రంప్ దూకుడు ప్రదర్శించారు. అరిజోనా, నెవాడా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాను గెలుచుకున్నారు. దీంతో ఏడు స్వింగ్ రాష్ట్రాలు ట్రంప్ వశం అయ్యాయి.
సెనేట్‌పై పట్టు సాధించిన రిపబ్లికన్ పార్టీ
అలాగే రిపబ్లికన్ పార్టీ సెనేట్‌పై మళ్లీ పట్టు సాధించింది. ప్రతినిధుల సభలో మెజారిటీ మార్క్‌ను చేరుకోవడానికి దగ్గరవుతోంది. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 52, డెమొక్రట్లకు 47 సీట్లు ఉన్నాయి. అలాగే హౌస్‌లో రిపబ్లికన్లు ఇప్పటివరకు 216 సీట్లు గెలుచుకోగా, డెమొక్రట్లు 209 సీట్లలో విజయం సాధించారు. హౌస్‌లో మెజారిటీ మార్క్ 218. ఈ సంఖ్యను దాటేస్తామని రిపబ్లికన్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కమిటీ వేసిన ట్రంప్
2025 జనవరి 20న జరగబోయే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి డొనాల్డ్ ట్రంప్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ అధ్యక్షుడిగా ఉండగా, స్టీవ్ విట్ కాఫ్, సెనేటర్ కెల్లీ ఉపాధ్యక్షులుగా ఉంటారు. ఈ మేరకు ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఎన్నికల్లో చరిత్ర సృష్టించామని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఫస్ట్ ఎజెండాకు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు వచ్చిందని తెలిపారు.
మైక్ పాంపియా, నిక్కీ హేలీకి నో ప్లేస్!
డొనాల్డ్ ట్రంప్ తన మునుపటి క్యాబినెట్లో భాగమైన మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీకి మొండిచెయ్యి చూపారు. త్వరలో ఏర్పాటు అవ్వబోయే తన అడ్మినిస్ట్రేషన్ టీమ్‌లో వారిద్దరికి స్థానం లేదని తేల్చి చెప్పారు. అయితే మైక్ పాంపియో, నిక్కీ హేలీ చేసిన సేవలకుగాను ధన్యవాదాల అని తెలిపారు. వారిద్దరితో కలిసి పనిచేయడాన్ని చాలా ఆనందించానని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ ప్లాట్ ఫామ్‌లో పోస్టు చేశారు.
2016-2020 మధ్యకాలంలో అధికారంలో ఉన్న ట్రంప్ ప్రభుత్వంలో నిక్కీ హేలీ, మైక్ పాంపియో కీలక శాఖలకు మంత్రులుగా వ్యవహరించారు. నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు. మైక్ పాంపియో సీఐఏ డైరెక్టర్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పనిచేశారు. ఆ తరువాత వారిద్దరూ కూడా అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచారు. అభ్యర్థిని ఎంపిక చేసుకోవడానికి రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడ్డారు. ఆ తర్వాత రేసు నుంచి తప్పుకుని ట్రంప్ నకు సంపూర్ణ మద్దతు తెలిపారు.