తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఈసారి ఓడిపోతే మళ్లీ పోటీ చేయను' - డొనాల్డ్ ట్రంప్‌ కీలక ప్రకటన - Trump 2024 Last Run Statement

Trump 2024 Last Run Statement : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈసారి కనుక తాను ఓడిపోతే, మళ్లీ పోటీ చేయబోనని స్పష్టం చేశారు.

Trump
Trump (AP)

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2024, 9:36 AM IST

Trump 2024 Last Run Statement :2024 అధ్యక్ష ఎన్నికల్లో కనుక తాను ఓడిపోతే, ఇక మళ్లీ పోటీ చేయబోనని అమెరికా మాజీ ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మంచి జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే తాజాగా రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్‌ ట్రంప్ ఓ ఇంటర్య్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 5న జరగబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే, ఇక మళ్లీ పోటీ చేయబోనని ప్రకటించారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో తాను కచ్చితంగా విజయం సాధిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. 78 ఏళ్ల ట్రంప్‌ ఇప్పటికే ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.

"మేం ఈసారి ఓడిపోతామని అస్సలు అనుకోవడం లేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. మేము తప్పకుండా విజయం సాధిస్తాం. ఒకవేళ మేం ఓడిపోతే, 2028 ఎన్నికల్లో నేను బరిలోకి దిగను. ఇప్పుడు నేను విజయం సాధిస్తే, దాని వెనుక ముగ్గురి కీలక పాత్ర ఉంటుంది. కెన్నడీ జూనియర్, ఎలాన్ మస్క్, తులసి గబ్బార్డ్‌కు చాలా విషయాలపై అవగాహన ఉంది. ఆరోగ్యం, పర్యావరణంపై కెన్నడీ పని చేస్తారు. దేశంలోని చెత్తను తొలగించడంలో మస్క్‌ కీలక పాత్ర పోషిస్తారు. పరిపాలనలో తులసి గబ్బార్డ్​కు అనుభవం ఉంది. మేం వచ్చిన 12 నెలల్లోనే ఇంధనం ధరలను 50% వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. ఇది వ్యాపారులకు కూడా బాగా ఉపయోగపడుతుంది" అని ట్రంప్ పేర్కొన్నారు.

ఆ ప్రతిపాదనకు ట్రంప్ అంగీకరించాలి : కమలా హారిస్
డెమొక్రటిక్‌ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ఇటీవల జరిగిన డిబేట్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ తడబాటుకు గురయ్యారని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో మరోసారి కమలాతో ఓపెన్‌ డిబేట్‌ చేయబోనని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 23న సీఎన్‌ఎన్‌ వేదికగా జరగబోయే డిబేట్‌కు తాను సిద్ధమని, డొనాల్డ్​ ట్రంప్‌ కూడా దానికి అంగీకరించాలని కమలా హారిస్‌ పేర్కొన్నారు. "ట్రంప్‌ నాతో డిబేట్‌ చేయడానికి అంగీకరించాలి. అమెరికా ప్రజల కోసం ఆయన పాల్గొనాలి. ఎన్నికల ముందు ఒకసారి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడాలి. మరోసారి చర్చించేందుకు నేను ఎదురుచూస్తున్నా. కానీ, ప్రత్యర్థి మాత్రం తప్పించుకునేందుకు కారణాలను వెతికే పనిలో ఉన్నారు" అని న్యూయార్క్‌ సిటీలో ఓ ఫండ్‌రైజర్‌ కార్యక్రమంలో కమలా హారిస్‌ వ్యాఖ్యానించారు. తాజాగా ఎన్‌బీసీ న్యూస్‌ విడుదల చేసిన పోల్‌లోనూ కమలా హారిస్‌ 5 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కమలా హారిస్‌కు 48%, ట్రంప్‌నకు 40% మంది మద్దతు పలికారు. మూడు పాయింట్లు ఎర్రర్ మార్జిన్​గా ఉన్నట్లు ఎన్‌బీసీ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details