Trump Offered Musk Cabinet Role :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు క్యాబినెట్‌లో చోటిస్తానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలా కాని పక్షంలో సలహాదారుడిగానైనా నియమించుకుంటానని తెలిపారు. మస్క్ చాలా తెలివైన వ్యక్తి అంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు.
విద్యుత్ వాహనాలపై ఇస్తోన్న 7,500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. ట్యాక్స్ క్రెడిట్‌లు, పన్ను ప్రోత్సాహకాలు సాధారణంగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశాలు కావని అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వస్తే ఆ మేరకు నిబంధనల్లో మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. లేదా దాన్ని పూర్తిగా రద్దు చేసేలా కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ తాజాగా వెల్లడించారు. అధిక ధరల వల్ల విద్యుత్తు కార్లకు అంతగా గిరాకీ లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తాను పెట్రోల్ కార్ల తయారీ వైపు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు.
తనను క్యాబినెట్‌లోకి తీసుకుంటానన్న ట్రంప్ ప్రతిపాదనపై ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ’కి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ బాధ్యతల్లో ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఓ చిత్రాన్ని కూడా పోస్ట్ చేశారు. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి. వృథాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్‌తో ఇటీవల జరిగిన చర్చలో మస్క్ ప్రతిపాదించారు.