Max Magazine Trump :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న ట్రంప్‌ను పర్సన్ ఆఫ్ ఇయర్-2024గా ఎంపిక చేసింది ప్రతిష్టాత్మక టైమ్ మేగజైన్. ఈ అరుదైన గుర్తింపును పొందడం ఆయనకు ఇది రెండోసారి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అప్పుడు కూడా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.
2024 ఏడాదికి గాను పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డు కోసం 10 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది టైమ్స్ మేగజైన్. డొనాల్డ్ ట్రంప్‌తో పాటు కమలా హారిస్, కేట్ మిడిల్టన్, ఎలాన్ మస్క్, బెంజమిన్ నెతన్యాహు, మార్క్ జుకర్‌బర్గ్, యులియా నవాల్నాయా, జెరోమ్ పావెల్, జో రొగాన్, క్లాడియా షెన్‌బామ్ పేర్లను తుది పరిశీలనకు తీసుకుంది. చివరగా ట్రంప్‌ను ఎంపిక చేసింది.
మరోవైపు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభ గంటను కూడా మోగించారు ట్రంప్. బెల్ మోగించడానికి ముందు ఇది చాలా పెద్ద గౌరవమని తెలిపారు. టైమ్ మేగజైన్ నుంచి రెండోసారి గౌరవాన్ని పొందుతున్నానని చెప్పారు. బెల్ మోగించడానికి ముందు ప్రజలు నినాదాలు చేయడం వల్ల పిడికిలి బిగించారు. ఆ సమయంలో అక్కడ ట్రంప్ భార్య మోలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన JD వాన్స్ సహ పలువురు ఉన్నారు.