Trump On USAID Workers :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఓ వైపు ప్రపంచ దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసిన ట్రంప్ తాజాగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్) ఉద్యోగులపై వేటు వేశారు. రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యూఎస్‌ఎయిడ్ వెబ్సైట్లో ఓ నోటీసు ద్వారా తెలిపారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మిగిలినవారిలో కొంతమందిని మినహాయించి వేలమంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాతే ట్రంప్ యంత్రాంగం ఈ విషయంలో ముందుకెళ్లింది.
USAID ఉద్యోగులపై ట్రంప్ వేటు- 2,000మంది ఔట్! - TRUMP ON USAID WORKERS FIRING
ట్రంప్ సంచలన నిర్ణయం- 2వేల మంది యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులు తొలగింపు

Published : Feb 24, 2025, 10:32 AM IST
ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేసేలా ఆదేశించాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల నికోలస్ తిరస్కరించారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికి పనిచేస్తున్న మస్క్ నేతృత్వంలోని డోజ్ ఇప్పటికే అనేకమంది యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా తీసుకొన్న ఈ నిర్ణయం మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది. అయితే యుఎస్‌ఎయిడ్ ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని మస్క్ ఇప్పటికే ఆరోపణలు చేశారు. అందుకే నిధులను ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులోభాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఈ ఆదేశాలపై ఫెడరల్ జడ్జి అమీర్ అలీ గతవారం తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు యూఎస్‌ఎయిడ్ ద్వారా సాయం అందించడానికి ఆమోదం తెలిపినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా నిలిపేయగలదని జడ్జి నిలదీశారు.
అయినా ట్రంప్ తన చర్యలను సమర్థించుకుంటున్నారు. యూఎస్ ఎయిడ్ ద్వారా భారత్‌లో జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచడానికి అమెరికా ప్రభుత్వం రూ.182 కోట్లు ఇచ్చిందని ట్రంప్ పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇకపై అటువంటి నిధులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద చాలా డబ్బు ఉందని, ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై ఇరుదేశాల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.