Weapon Companies Business :ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, ఇతర సంక్షోభాల కారణంగా గతేడాది ఆయుధ వ్యాపార కంపెనీలు బాగా లాభపడ్డాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి (సిప్రి) నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని 100 ఆయుధ కంపెనీలు 2023లో ఏకంగా 632 బిలియన్ డాలర్ల (రూ.53 లక్షల కోట్ల) వ్యాపారం జరిగినట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 4.2శాతం అధికమని తెలిపింది. వాస్తవానికి 2022లో చాలా ఆయుధ కంపెనీలు కనీస డిమాండ్ కూడా లేక డీలా పడ్డాయి.
కానీ, ఏడాది తిరిగేసరికి అవి వాటి ఉత్పత్తిని గణనీయంగా పెంచాల్సిన పరిస్థితి తలెత్తింది. తాము పరిశీలించిన 100 ఆయుధ కంపెనీలకు 2023లో కనీసం 1 బిలియన్ డాలర్లు (రూ.8.4 వేల కోట్లకు) పైగా వ్యాపారం జరిగినట్లు సిప్రి వెల్లడించింది. 2024లో కూడా అదే తీరు కొనసాగుతోందని సిప్రి ఆయుధ ఉత్పత్తి నిపుణుడు లోరెంజో పేర్కొన్నారు. గాజా, ఉక్రెయిన్, ఇతర సంక్షోభాల కారణంగా పుట్టుకొచ్చిన డిమాండ్‌ను అందుకోవడంలో చిన్న ఉత్పత్తిదారులు ముందున్నారని సిప్రి వెల్లడించింది. వీరు ప్రత్యేకమైన పరికరాలు తయారు చేయడమో, సిస్టమ్స్‌ను నిర్మించడమో చేసేవారని సైనిక వ్యయ-ఆయుధ ఉత్పత్తి కార్యక్రమం నిపుణుడు నాన్ టియాన్ తెలిపారు.