Peaceful Transition In Syria : సిరియాలో శాంతి స్థాపనతో పాటు రాజకీయ పరివర్తన కోసం అమెరికా, తుర్కియే, ఐరోపా సమాఖ్య, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. జోర్డాన్‌లో వివిధ దేశాల విదేశాంగ మంత్రులు హాజరై సిరియాలో తదుపరి పరిస్థితులపై చర్చించారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సిరియాలో ఉన్న ఇజ్రాయెల్ దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు నియంత్రిస్తున్న హయాత్ తహరీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) తిరుగుబాటుదారులతో ప్రత్యక్ష సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా తెలిపింది.
సిరియాలో తీవ్రవాద గ్రూపుల ఆవిర్భావాన్ని నిరోధించాలని, రసాయన ఆయుధాల నిల్వలను సురక్షితంగా నాశనం చేయాలని అమెరికా, తుర్కియే, ఐరోపా సమాఖ్య, అరబ్ దేశాలు పిలుపునిచ్చారు. సిరియా ప్రాదేశిక సమగ్రతకు పూర్తి మద్దతును కూడా తెలిపారు. అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు మరో ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. సిరియన్లు ఆమోదించిన కొత్త రాజ్యాంగం ఆధారంగా ఐరాస-పర్యవేక్షించే ఎన్నికలకు పిలుపునిచ్చారు. సిరియా బఫర్ జోన్‌తో పాటు సమీపప్రదేశాల్లో ఇజ్రాయెల్ చొరబాట్లను హేయమైన చర్యగా పేర్కొన్నారు.
రెబల్స్‌కు అమెరికా మద్దతు
మరోవైపు సిరియా భవిష్యత్ ఎలా ఉండాలన్న తమ ఆలోచనలకు ఐరాస, అరబ్‌లీగ్, తుర్కియే సహా పలు దేశాలు మద్దతు పలికాయని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. సిరియాలో జరుగుతున్న పరిణామాలు దాని సరిహద్దులకు వెలుపల కూడా వలసలు, ఉగ్రవాదం వంటి శక్తిమంతమైన ప్రభావాలు చూపిస్తాయన్నారు. మైనారిటీలు, మహిళల హక్కులను గౌరవించాలని, ఉగ్ర గ్రూపును నిరోధించాలని, మానవతా సాయం ప్రజలందరికీ చేరేలా చూడాలని రెబల్స్‌కు సూచించనున్నట్లు బ్లింకెన్ పేర్కొన్నారు. అసద్ కాలం నాటి రసాయన ఆయుధాలను సురక్షితంగా నాశనం చేయాలని అన్ని దేశాలు సంయుక్త ప్రకటన చేశాయని తెలిపారు. ఆ నిబంధనలను పాటించే కొత్త ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించి మద్దతు ఇస్తుందని బ్లింకెన్ హామీ ఇచ్చారు.
సిరియాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు
మరోవైపు సిరియా రాజధాని డమాస్కస్ దాని శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులను ఉద్ధృతం చేసింది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి బంకర్లు ఉన్నట్లు సిరియా సైనిక వర్గాలు వెల్లడించాయి. పర్వతాల దిగువన ఏర్పాటు చేసిన బంకర్లలోని రాకెట్లను, ఆయుధసామగ్రిని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ధ్వంసం చేసిందని బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్‌ఓహెచ్‌ఆర్) స్పష్టం చేసింది. అంతేకాకుండా పర్వతసానువుల్లోని సొరంగాలను, ఆయుధ డిపోలను, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను కూడా ఐడీఎఫ్ బలగాలు నాశనం చేశాయని వెల్లడించింది. డమాస్కస్‌కు ఉత్తరంగా ఉన్న బార్జేలోని సైనిక శాస్త్రసాంకేతిక విభాగాలకు చెందిన సామగ్రిని కూడా ఐడీఎఫ్ నాశనం చేసినట్లు ఎస్‌ఓహెచ్‌ఆర్ తెలిపింది.