తెలంగాణ

telangana

ETV Bharat / international

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్ట్​ - SOUTH KOREA PRESIDENT ARRESTED

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్టు

South Korea President
South Korea President (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 8:39 AM IST

South Korea President Arrested :అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్టయ్యాయరు. మార్షల్‌ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి పెను చిక్కులను యోల్ తెచ్చుకున్నారనే చెప్పాలి.

బుధవారం తెల్లవారుజామున వందలాది మంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. తొలుత అధ్యక్ష భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. కొంతసేపు ప్రతిష్టంభన నెలకొన్న తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్‌ సుక్‌ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను అక్కడి నుంచి తరలించారు. గతంలో యోల్‌ను అరెస్టు చేసేందుకు ఓసారి ప్రయత్నించగా పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ గతేడాది డిసెంబరులో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మార్షల్‌ లా విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల యూన్‌ సుక్‌ తన ప్రకటనను విరమించుకున్నారు. కానీ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో మార్షల్‌ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకువచ్చాయి. ఆ తర్వాత పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్‌ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్‌ ప్రకటించారు.

మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడం వల్ల కోర్టును ఆశ్రయించగా అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details