Modi Russia Visit 2024 : రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. చరిత్రాత్మక స్థాయిలో మూడోసారి గెలుపొందారంటూ మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ తన జీవితాన్ని భారత ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. ఈ మేరకు సోమవారం రాత్రి మోదీ గౌరవార్థం పుతిన్ నోవో ఓగర్యోవోలోని తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. తన ఇంటికి వచ్చిన మోదీకి ఆయన ఘనంగా స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు.
మరోసారి సేవ చేసే అవకాశం!
పుతిన్, మోదీ కాసేపు పలు విషయాలపై చర్చించుకున్నారు. "మీరు మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా మీరు చేసిన కృషికి ఫలితం ఇది అని నేను భావిస్తున్నాను. మీరు చాలా శక్తిమంతమైన వ్యక్తి" అని పుతిన్ అన్నారు. దీంతో భారత ప్రజలు మాతృభూమికి సేవ చేసే అవకాశం మరోసారి తనకు ఇచ్చారని మోదీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకున్నారు.
ప్రాంతీయ శాంతికి మద్దతుగా!
అయితే ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు మద్దతుగా నిలుస్తామని మోదీ ఉద్ఘాటించారు. ప్రత్యేకమైన, గౌరవప్రదమైన భారత్, రష్యా వ్యూహాత్మక బంధం గత పదేళ్లలో మరింత ముందుకు సాగిందని తెలిపారు. ఇంధన, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యటకం వంటి రంగాలతోపాటు ప్రజల మధ్య సాంస్కృతిక బంధం విస్తృతమైందని పేర్కొన్నారు. సోమవారం రష్యా చేరుకున్నాక ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్, రష్యా బంధం ద్వారా రెండు దేశాల ప్రజలు ప్రయోజనం పొందుతారని చెప్పారు.