US On India Russia Relation : రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు లభించేలా కృషి చేయాలని భారత్‌కు అమెరికా విజ్ఞప్తి చేసింది. రష్యాతో ఉన్న దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని చెప్పింది. చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించి, శాంతి స్థాపనకు కృషి చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెప్పాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కోరారు. రష్యాలో ప్రధాని మోదీ పర్యటించిన వేళ తమను అలుసుగా తీసుకోవద్దంటూ భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఇటీవల తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇలా భారత్‌ను కోరడం గమనార్హం.
'అందుకే ఒత్తిడి చేస్తున్నాం'
దిల్లీ-మాస్కో మధ్య బలమైన సంబంధాలు ఉన్నట్లు మాథ్యూ మిల్లర్ గుర్తు చేశారు. రష్యాతో భారత్‌కు సుదీర్ఘ బంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. రష్యాతో భారత్‌కు పటిష్ఠ బంధం, విశిష్ట స్థానం ఉందన్నారు. ఐరాస నిబంధనలను, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పుతిన్‌కు సూచించమని భారత్‌కు చెబుతున్నట్లు వివరించారు. భారత్‌తో తమకూ సత్సంబంధాలు ఉన్నాయని, అందుకే ఈ విషయంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని మాథ్యూ మిల్లర్ తెలిపారు.