Iran Preparing Rocket Launchers For Israel Attack: ఇరాన్, ఇజ్రాయెల్‌లు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. యుద్ధానికి అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చుకునే పనిలో రెండు దేశాలు తలమునకలయ్యాయి. దీంతో ఏ క్షణమైనా యుద్ధం మొదలుకావొచ్చునన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో పశ్చిమాసియా నిప్పుల కుంపటిలా రగులుతోంది. యుద్ధానికి సన్నాహంగా అన్నట్లు ఇజ్రాయెల్ బుధవారం లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడితో హెజ్‌బొల్లాకు చెందిన పలువురు మరణించినట్లు తెలుస్తోంది. దాడికి ప్రతిదాడిగా హెజ్‌బొల్లాకు చెందిన డ్రోన్లు ఇజ్రాయెల్‌లోని నహారియా నగరంపై పడి విధ్వంసం సృష్టించాయి.
ఇరాన్‌కు రష్యా అండదండలు : మరోవైపు ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడి చేశారు. ఈ దాడిలో పలువురు అమెరికా సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్‌కు గట్టిగా బుద్ధిచెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న ఇరాన్, మిత్రదేశమైన రష్యా నుంచి ఆయుధాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది. రష్యా ఇరాన్‌కు అధునాతన రాడార్ వ్యవస్థలతో పాటుగా క్షిపణి విధ్వంసక వ్యవస్థలను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా నేత సెర్గీ షొయిగు ఇరాన్ వచ్చి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఆయుధాల సరఫరాలు మొదలయినట్లు సమాచారం. అయితే దాడి చేసినా, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్‌కు సూచించినట్లు తెలుస్తోంది.
దాడులపై కన్నేసిన అమెరికా :పశ్చిమాసియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అమెరికా - మరిన్ని బలగాల్ని ఆ ప్రాంతానికి పంపుతోంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే, దౌత్యమార్గాల ద్వారా ఇరాన్‌కు నచ్చచెప్పే పనిలో అమెరికా నిమగ్నమైంది. ఇజ్రాయెల్‌పై తీవ్రస్థాయి ప్రతిఘటన తప్పదని హెజ్‌బొల్లా నాయకుడు హసన్ నజరుల్లా మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు.
నేడూ, రేపూ గగనతల ఆంక్షలు : ఈ నెల 7, 8 తేదీల్లో సైనిక విన్యాసాలు చేపడుతున్న నేపథ్యంలో గగనతల ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ వైమానిక సంస్థ ఎన్‌వోటీఎంను తెలిపింది. ఇరాన్ గగనతలం నుంచి గగనతలంలోకి దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగాలు చేపట్టనుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 నుంచి మధ్యహ్నం 2.30 వరకూ గురువారం తెల్లవారుజామున 4.30 నుంచి ఉదయం 7.30 వరకూ సైనిక విన్యాసాలు జరుగనున్నాయి.