Republican Primary Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో గెలిచిన ఆయన, తాజాగా వర్జిన్ ఐలాండ్స్, నెవాడ ప్రైమరీ ఎలక్షన్లోనూ ఘన విజయం సాధించారు. గురువారం వర్జిన్ ఐలాండ్స్‌లో జరిగిన ఎన్నికలో ట్రంప్ 73శాతం ఓట్లు సాధించి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి నిక్కి హేలీకి కేవలం 26శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. నెవాడాలో ఏకగ్రీవంగా గెలిచారు.
ఎన్నికల ఫలితాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. "మీ అందరికి నా ధన్యవాదాలు. మేము ఘన విజయం సాధించాం. వాస్తవానికి మేం గెలుస్తామని ముందే ఊహించాం. కానీ ఇంత భారీ మెజారిటీతో గెలుస్తామని మాత్రం అనుకోలేదు. మీరు అందించిన ఈ విజయాన్ని ఎప్పుడూ మరిచిపోను." అని తెలిపారు. అయితే, గురువారం జరిగిన వర్జినియా ఎన్నికల్లో అధికారులు నిబంధనలు పాటించలేదు. అనుమతించిన దానికంటే ముందుగానే పోటీని నిర్వహించారు.
నెవాడ ప్రైమరీ ఎన్నికల్లో ఏకగ్రీవం
నెవాడా ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. అభ్యర్థిత్వ బరిలో ఉన్న నిక్కి హేలీ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఆయన ఏకగ్రీవంగా గెలిచారు. ఎన్నికల్లో నిబంధనలు పాటించకపోవడం వల్ల బహిష్కరించినట్లు హేలీ తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయంతో ట్రంప్‌నకు 26 డెలిగెట్స్ లభించాయి. అధికారికంగా పార్టీ తరఫున నామినేషన్ దక్కించుకునేందుకు ఆయనకు 1,215 డెలిగెట్స్ అవసరం అవుతాయి.