Plane Crash Afghanistan Today : అఫ్గానిస్థాన్‌లో కుప్పకూలిన విమానం భారత్‌ది కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పష్టం చేసింది. బెజాక్ జిల్లా బదాక్షన్ ప్రావిన్స్‌లోని తోప్‌ఖానా పర్వతాల్లో కుప్పకూలిన విమానం మొరాకో రిజిస్ట్రర్డ్ DF ఎయిర్‌క్రాఫ్ట్ అని తెలిపింది.
ఇంతకీ ఏం జరిగింది?
ఆదివారం ఉదయం తోప్‌ఖానా పర్వతాల్లో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదాన్ని బదక్షన్ పోలీసు కార్యాలయం ధ్రువీకరించింది. ప్రమాదస్థలికి రెస్క్యూ టీమ్ పంపినట్లు తెలిపింది. ప్రమాదానికి గురైన విమానం మొరాకోకు చెందినదని తాలిబన్ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ వాహిద్ తెలిపారు. విమాన ప్రమాదానికి ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌కు ఈశాన్యంగా 250 కిలోమీటర్లు జెబాక్ ఉంది. ఇది గ్రామీణ పర్వత ప్రాంతం.
భారత విమానమని వార్తలు
తొలుత భారతీయ ప్రయాణికులు ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిందని అఫ్గాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డీజీసీఏ విమాన ప్రమాదంపై క్లారిటీ ఇచ్చింది. థాయ్‌లాండ్ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయల్దేరిన ఈ విమానం భారత్‌లోని గయ విమానాశ్రయంలో ఇంధనం కోసం ఆగినట్లు డీజీసీఏ తెలిపింది. ఆ విమానాన్ని ఎయిర్ అంబులెన్స్‌గా ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.
అటు భారత్‌కు చెందిన విమానం కుప్పకూలిందన్న వార్తలు వస్తున్న సమయంలో రష్యా మరో విషయాన్ని వెల్లడించింది. తమ దేశానికి చెందిన ఫాల్కన్ జెట్ 10 విమానం కుప్పకూలిందని తెలిపింది. అందులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని, శనివారం రాత్రి నుంచే ఆ విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని పేర్కొంది. తప్పిపోయిన విమానంలో నలుగురు సిబ్బంది, ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించింది. ప్రమాదానికి గురైన విమానం థాయ్‌లాండ్‌లోని యుతపావో రేయోంగ్ పట్టాయా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు వివరించింది. విమానం అథ్లెటిక్ గ్రూప్ ఎల్ఎల్సీ, ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందినదని రష్యా అధికారులు తెలిపారు.
జపాన్ విమాన ప్రమాదం
Plane Fire In Japan :ఈ ఏడాది జనవరి2న జపాన్‌లోని హొక్కైడో విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం హనేడా ఎయిర్‌పోర్టులో దిగుతున్న సమయంలో జపాన్ కోస్టు గార్డుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీ కొట్టింది. ఒక్కసారిగా పేలుడు సంభవించి విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఉన్న 379 మంది సురక్షితంగా బయటపడ్డారు. కోస్టుగార్డ్ విమానంలో ఉన్న ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.