Papua New Guinea Land Slide Death Toll :పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 670 మందికిపైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ అంచనా వేసింది. కొండచరియలు విరిగిపడడం వల్ల 150కిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. అలాగే వందలాది మంది శిథిలాల కిందే సమాధి అయ్యారని తెలిపింది.
అసలేం జరిగిందంటే?
పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌లోని కావోకలం గ్రామంపై శుక్రవారం వేకుమజామున 3గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద నలిగిపోయిన వారి కోసం గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అనేక ఇళ్లు పూర్తిగా నేలమట్టమై బండరాళ్లు, చెట్ల కింద కూరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెప్పారు. 100కు పైగా మృతదేహాలను వెలికి తీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పపువా న్యూ గినియా అధికారులు ఆలస్యంగా స్పందించారు.
670 మందికిపైగా మృతి
కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మందికిపైగా మరణించారని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. అలాగే 60 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఆదివారం నాటికి ఐదు మృతదేహాలను మాత్రమే పపువా న్యూ గినియా అధికారులు వెలికితీశారు. తాజాగా మృతుల సంఖ్యను ఐరాస శరణార్థుల ఏజెన్సీ అంచనా వేసింది. కొండచరియలు విరిగిపడ్డ దుర్ఘటనలో 670 మందికిపైగా మరణించారని అంచనా వేసింది. చాలా మృతదేహాలు శిథిలాల కిందే ఉండిపోయాయని తెలిపింది.