తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ ప్రమాణ స్వీకారం - షెహబాజ్ ప్రమాణ స్వీకారం

Pakistan PM Shehbaz Oath : పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణం స్వీకారం చేశారు. సోమవారం అధ్యక్ష భవనంలో 24వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Pakistan PM Shehbaz Oath
Pakistan PM Shehbaz Oath

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 4:41 PM IST

Updated : Mar 4, 2024, 5:39 PM IST

Pakistan PM Shehbaz Sharif Oath : పాకిస్థాన్ ప్రధానమంత్రిగాా రెండోసారి ప్రమాణం స్వీకారం చేశారు షెహబాజ్ షరీఫ్. దేశానికి 24వ ప్రధాని మంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష భవనంలో షెహబాజ్​తో ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్, పీపీపీ నేత, సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా, ఇతర పీఎంఎల్- ఎన్ నేతలు పాల్గొన్నారు. వారితో పాటు త్రివిధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు, దౌత్యవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు.

అంతకుముందు ఆదివారం పాకిస్థాన్ ప్రధాని ఎంపిక కోసం పార్లమెంట్​లో ఓటింగ్ నిర్వహించారు. 336 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో షెహబాజ్​కు 201 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పాకిస్థాన్ తెహ్రీక్ ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అభ్యర్థి ఓమర్ అయూబ్​ ఖాన్​కు 92 ఓట్లు వచ్చాయి. మెజారిటీ అవసరమైన వాటి కంటే షెహబాజ్​కు 32 ఓట్లు అధికంగా వచ్చాయి. 2022 ఏప్రిల్‌ నుంచి 2023 ఆగష్టు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి షెహబాజ్ మొదటిసారి ప్రధానిగా పని చేశారు.

ఆర్థిక సంస్కరణలే పెద్ద సవాల్
ప్రధానిగా ఎన్నికైన తర్వాత షెహబాజ్ పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి గురించి లేవనెత్తారు. మన ముందు పెద్ద సవాలే ఉంది అంటూ మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలు అవసరమని తెలిపారు. పొరుగువారితో పాటు అన్ని కీలక దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉంటామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం స్నేహితులను పెంచుకుంటుందని చెప్పారు. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన ఆయన, ఈ సమస్యను పాలస్తీనాతో పోల్చారు. కశ్మీర్‌కు స్వేచ్ఛ కల్పించేందుకు సభ మొత్తం ఐక్యంగా తీర్మానం చేయాలని కోరారు.

పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా
1951లో పంజాబీ మాట్లాడే కశ్మీరీ కుటుంబంలో షెహబాజ్‌ షరీఫ్​ జన్మించారు. లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాల విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన కుటుంబం వ్యాపారం కోసం కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ నుంచి అమృత్‌సర్‌ జిల్లాలోని జాతీ ఉమ్రా గ్రామానికి వచ్చి స్థిరపడింది. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రిగా షెహబాజ్‌ పని చేశారు.

ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో 265 స్థానాలకుగాను పాకిస్థాన్ తెహ్రీక్​- ఎ- ఇన్సాఫ్ (పీటీఐ) 93 చోట్ల విజయం సాధించింది. పీఎంఎల్- ఎన్ 72, పీపీపీ-52, ముత్తాహిదా క్వామీ మూవ్​మెంట్ 15, ఇతర పార్టీలు 8 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవటం వల్ల పీఎంఎల్ -ఎన్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పీపీపీ కలిసి కూటమిగా ఏర్పాడ్డాయి. సుదీర్ఘ చర్చలు అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించి, ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్​కు ప్రకటించాయి. తాజా ఓటింగ్​లో మెజారిటీని సాధించి రెండోసారి ప్రధానిగా ఎన్నికై ప్రమాణం చేశారు.

పంజాబ్​ ప్రావిన్స్​ సీఎంగా మరియం నవాజ్​- పాక్​ చరిత్రలో తొలిసారి!

ట్రంప్​ దూకుడుకు బ్రేక్​- నిక్కీ హేలీకి తొలి ప్రైమరీ విజయం

Last Updated : Mar 4, 2024, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details