తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇమ్రాన్ ఖాన్​ 'బౌన్స్​ బ్యాక్'- అంచనాలు తారుమారు- విజయం దిశగా పాక్ మాజీ ప్రధాని!

Pakistan Election Results : పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అంచనాలకు పూర్తి భిన్నంగా వెలువడుతున్నాయి. విశ్లేషకుల అంచనాలకు ఏమాత్రం అందని విధంగా మాజీ ప్రధాని, PTI అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు విజయపథంలో సాగుతున్నట్లు తెలుస్తోంది.

pakistan election results
pakistan election results

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 2:46 PM IST

Pakistan Election Results : పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో దూసుకెళ్తోంది. ఆ పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితాల వెల్లడిలో జాప్యం ఉన్నా, తాము 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు పీటీఐ వెల్లడించింది. ఇప్పటివరకు పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి సంబంధించి 20స్థానాల ఫలితాలు ప్రకటించగా, 10చోట్ల ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులే విజయం సాధించారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని PML(N) పార్టీ ఐదు స్థానాల్లో, మరో ఐదుచోట్ల పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.

లాహోర్‌లో నవాజ్‌ షరీఫ్‌ కూడా గెలుపొందినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుత ప్రధాని షెహబాజ్​ షరీఫ్ లాహోర్​​ జాతీయ, ప్రావిన్స్​ అసెంబ్లీ స్థానాలు నుంచి గెలుపొందారు. జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో షరీఫ్​కు 63,953 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అఫ్జల్​ అజీమ్​కు 48,486 ఓట్లు వచ్చాయి. ప్రావిన్స్​ అసెంబ్లీలో 38,642 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థికి 23,847 ఓట్లు వచ్చాయి.

చిత్తుగా ఓడిన హఫీజ్ సయీద్​ కుమారుడు
నిషేధిత ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్​ కుమారుడు తల్హా సయీద్​ చిత్తుగా ఓడిపోయారు. లతిఫ్​ ఖోసాకు 1,17,109 ఓట్లు రాగా, తల్హాకు కేవలం 2024 ఓట్లు మాత్రమే వచ్చాయి. పాకిస్థాన్​ మర్కజీ ముస్లిం లీగ్​ అనే పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తల్హా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టారు.

ఫలితాల జాప్యంపై పీటీఐ ఫైర్​
అంతకుముందు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ECP) కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందని పీటీఐ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో తమ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలుపొందారని ఇమ్రాన్‌ వివరించారు. ఎన్నికల అధికారులు ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీకి చెందిన ఎన్నికల గుర్తు బ్యాట్‌ను ఎన్నికల సంఘం రద్దు చేయటం వల్ల వారంతా స్వతంత్రులుగా పోటీ చేశారు. ఫలితాల జాప్యంపై పాక్‌ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్‌ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది.

ఫలితాల ఎఫెక్ట్​- నష్టపోయిన స్టాక్​ మార్కెట్లు
మరోవైపు పాకిస్థాన్​ ఎన్నికల ఫలితాల జాప్యంతో ఆ దేశ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చెంజీ సూచీ KSE-100 సుమారు 1700 పాయింట్ల మేర నష్టపోయింది. ఎన్నికల తర్వాత ఫలితాల ప్రకటనలో నెలకొన్న జాప్యం కారణంగా కొనుగోళ్లకు బదులు అమ్మకాలు చేపట్టడం వల్ల మార్కెట్లు నష్టపోయాయి.

ఆధిక్యంలో ఇమ్రాన్​ ఖాన్​ పార్టీ!- పాక్​ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు
బాంబు పేలుళ్లు, కాల్పుల మధ్య పాక్​లో ఎన్నికలు​- నలుగురు మృతి- షరీఫ్​కు పీఠం!

ABOUT THE AUTHOR

...view details