Pakistan Election Results 2024 :పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' పార్టీకి మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారని సమాచారం. ఇప్పటివరకు వారు 61 స్థానాల్లో గెలుపొందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని 'పీఎంఎల్-ఎన్' పార్టీకి 43 సీట్లు, అలాగే 'పీపీపీ' పార్టీకి 34 సీట్లు దక్కినట్లు వెల్లడించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓ వైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే 'పీఎంఎల్-ఎన్' పాకిస్థాన్‌లోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందంటూ నవాజ్ షరీఫ్ ప్రకటించడం గమనార్హం.
వారికి నవాజ్ పిలుపు!
మరోవైపు పాకిస్థాన్‌లోని ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నవాజ్ షరీఫ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి ఎన్నికల ఫలితాలను గౌరవిస్తున్నానని చెప్పిన ఆయన, దేశ పునర్నిర్మాణం దిశగా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీలు తమతో చేతులు కలపాలంటూ ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు. సంక్షోభ పరిస్థితుల నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చే విషయంలో అన్ని సంస్థలు కలిసి సానుకూల పాత్ర పోషించాలని షరీఫ్ కోరారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీపీపీ, జేయూఐ-ఎఫ్, ఎంక్యూఎం-పీతో పాటు తదితర పార్టీలతో సంప్రదింపులు జరపాలంటూ తన సోదరుడు షెహబాజ్‌కు ఆయన సూచించినట్లు తెలిపారు.