Pakistan Election 2024 :పాకిస్థాన్ ఎన్నికలను ప్రభావితం చేసిన సైన్యం అధికారంలోకి ఎవరు రావాలన్న విషయాన్ని శాసించే దిశగానూ పావులు కదుపుతోంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలో ని పీఎంఎల్-ఎన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు సంపూర్ణ సహకారమందిస్తోంది. పీఎంఎల్-ఎన్ 75 స్థానాల్లో, ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో, బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 54 స్థానాల్లో గెలుపొందాయని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఎంక్యూఎం-పీ మరో 17 స్థానాల్లో విజయం సాధించిందని తెలిపింది.
నవాజ్‌కు పీపీపీ మద్దతిస్తుందా?
నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ఎంక్యూఎం-పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సైన్యం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాల్సిన నేపథ్యంలో ఈ మూడు పార్టీలకు సరిపడా బలం ఉంది. అయితే ఈ పొత్తుకు ఇంకా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, ఎంక్యూఎం-పీ పచ్చజెండా ఊపలేదు. షరీఫ్ ప్రధాని కావడం పీపీపీకి ఇష్టం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలతో సానుకూల చర్చలు జరిగే విధంగా చూడాల్సిన బాధ్యతను సోదరుడు షెహబాజ్ షరీఫ్‌కు అప్పగించారు నవాజ్ షరీఫ్. ఇప్పటికే ఆయన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నవాజ్‌కు అనుకూలంగా ఏకంగా సైన్యాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ కూడా ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ఇదివరకే పిలుపునిచ్చారు.
'ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తాం'
మరోవైపు ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ మాత్రం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెబుతోంది. తాము 170 స్థానాల్లో నెగ్గామని అధికారులు అక్రమాలు చేసి తమ అభ్యర్థులను ఓడించారని ఆరోపిస్తోంది. ఈ మేరకు ఓడిపోయిన పీటీఐ అనుకూల స్వతంత్ర అభ్యర్థులు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.