తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఎన్నికల్లో మనోళ్లు- తొమ్మిది చోట్ల పోటీ- విన్నింగ్ ఛాన్సెస్ ఇలా! - US ELECTIONS 2024

అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు తొమ్మిది మంది భారతీయులు పోటీ

Indians In US Elections
Indians In US Elections (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 12:34 PM IST

Indians In US Elections : అమెరికాలో అధ్యక్ష స్థానంతో పాటు కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి తొమ్మిది మంది భారతీయులు పోటీపడుతున్నారు. వారిలో ఐదుగురు తమ స్థానాల నుంచే పోటీ చేస్తున్నారు. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? వారి విజయావకాశాలు ఎలా ఉన్నాయి?

ఇండో- అమెరికన్‌గా రికార్డు?
వర్జీనియా నుంచి పోటీ చేస్తున్న సుహాస్‌ సుబ్రహ్మణ్యం పోటీ చేస్తున్నారు. 38 ఏళ్ల ఆయన విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఎన్నికైతే మాత్రం తొలిసారి ఈ రాష్ట్రం నుంచి గెలిచిన ఇండో- అమెరికన్‌గా రికార్డు సృష్టించనున్నారు. వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డాక్టర్‌ అమిబెరా మరోసారి బరిలో దిగారు. 59 ఏళ్ల అమి 2013 నుంచి ఈ స్థానంలో విజయం సాధిస్తున్నారు. ఈసారి డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో ఆధిక్యం సాధిస్తే, ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రమీలా జయపాల్‌ పోటీ చేస్తున్నారు. 2017 నుంచి ఆమె ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటా వస్తున్నారు. 59 ఏళ్ల ఆమె డెమొక్రటిక్‌ పార్టీలో శక్తిమంతమైన నేతగా ఇప్పటికే ఎదిగారు.

  • ఇల్లినాయిస్‌ 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి రాజా కృష్ణమూర్తి ఎన్నికల్లో నిలిచారు. 2017 నుంచి ఆయన ఇక్కడ విజయం సాధిస్తున్నారు.
  • కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి రో ఖన్నా పోటీలో ఉన్నారు. ఆయన కూడా గత ఏడేళ్ల నుంచి గెలుస్తూ వచ్చారు.
  • మిషిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి శ్రీ తానేదార్‌ బరిలో ఉన్నారు. మిషిగాన్​తోపాటు ఇల్లినాయిస్, కాలిఫోర్నియా డెమోక్రాట్లకు పట్టున్న రాష్ట్రాలే.
  • అరిజోనా స్టేట్‌ అసెంబ్లీలో వరుసగా 2018, 20, 22ల్లో విజయం సాధించిన డాక్టర్‌ అమిష్‌ షా ఈసారి ప్రతినిధుల సభ బరిలోకి దిగారు. అరిజోనా తొలి కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి పోటీపడుతున్నారు. గెలిచే అవకాశం కూడా ఉంది.
  • రిపబ్లికన్‌ పార్టీ తరఫున డాక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి కన్సాస్‌ 3వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి పోటీపడుతున్నారు. ఇక డాక్టర్‌ రాకేశ్‌ మోహన్‌ న్యూజెర్సీ 3వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రతినిధుల సభ బరిలో ఉన్నారు. ఈయన కుడా గెలిచే అవకాశం కూడా ఉంది.

అయితే 1957లో తొలిసారి దలీప్‌ సింగ్‌ సంధూ కాలిఫోర్నియా 29వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి విజయం సాధించారు. అమెరికా ప్రతినిధుల సభలో తొలిసారి అడుగుపెట్టిన తొలి ఇండో- అమెరికన్‌ ఆయనే. మొత్తం మూడుసార్లు అక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత 2005లో బాబీ జిందాల్‌ లూసియానా నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఆ రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. పలుచోట్ల ప్రతినిధుల సభలో స్థానం కోసం పోటీపడుతున్న భారతీయుల్లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details