Nepal Landslide Today :నేపాల్‌లో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులపై కొండచరియలు విరిగిపడడం వల్ల త్రిశూలి నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. సెంట్రల్ నేపాల్ చిత్వాన్ జిల్లాలోని నారాయణ్ ఘాట్- ముగ్లింగ్ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విరిగిపడిన కొండచరియలను తొలగించారు.
వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం
కాగా, త్రిశూలి నదిలో బస్సులు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల ఆచూకీ కోసం సిబ్బంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో కూడా గాలిస్తున్నారు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ నుంచి రౌతహత్ గౌర్‌కు వెళ్తున్న ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. ఒక బస్సులో 24 మంది, మరో బస్సులో మిగతా వారు ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, గణపతి డీలక్స్ బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు ప్రమాద సమయంలో వాహనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు.
విచారం వ్యక్తం చేసిన నేపాల్ ప్రధాని
ఈ ఘటన పట్ల నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని రెస్క్యూ టీమ్, అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో కోరారు.