Muhammad Yunus History : షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడనున్న మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ అంగీకరించారు. ఈమేరకు బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాల వేదిక చేసిన విజ్ఞప్తికి ఆయన ఓకే చెప్పారు. తనపై విశ్వాసంతో ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించాలని నిరసనకారులు కోరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల కోసం ఎటువంటి బాధ్యతలనైనా తీసుకుంటానని అన్నారు. అంతేకాకుండా దేశంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎవరీ యూనస్?
మహ్మద్ యూనస్ 1940 సంవత్సరం జూన్ 28న బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జన్మించారు. ఆయన ఎంఏ ఎకానమిక్స్ కోర్సును పూర్తి చేశాక, 1961లో చిట్టగాంగ్‌లోని ఓ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా సేవలు అందించారు. 1965 సంవత్సరంలో యూనస్‌కు అమెరికాలో ఉన్నత విద్య కోసం 'ఫుల్‌బ్రైట్' స్కాలర్‌షిప్ లభించింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లి వ్యాండర్ బిల్ట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో పీహెచ్‌డీ చేశారు. 1969 నుంచి 1972 వరకు మర్‌ఫ్రీస్ బోరోలో ఉన్న మిడిల్ టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా యూనస్ సేవలు అందించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం సందర్భంగా ఓ పౌర సంఘాన్ని ఆయన స్థాపించారు. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పోరాటానికి మద్దతును సంపాదించేందుకు అమెరికా కేంద్రంగా బంగ్లాదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను యూనస్ నడిపారు. బంగ్లాదేశ్ ఒక దేశంగా ఆవిర్భవించిన తర్వాత ఆయన స్వదేశానికి తిరిగొచ్చారు. వెంటనే ఆయనకు దేశ ప్లానింగ్ కమిషన్‌లో సభ్యుడిగా అవకాశం లభించింది.