Miss World 2024 India : ఎంతో పతిష్ఠాత్మకంగా భావించే ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ వేదిక కానుంది. అయితే 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది ఇండియా. కాగా, ఈ ఏడాది జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు 71వది. ఈ మేరకు కార్యక్రమం నిర్వాహకులు మిస్ వరల్డ్ ట్విట్టర్ అధికారిక పేజీ వేదికగా ప్రకటించారు.
'ఈ ఏడాది జరిగే మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశంగా భారత్‌ను ప్రకటించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ ప్రకటన నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. అందం, వైవిధ్యం, మహిళా సాధికారతకు సంబంధించిన ఈ వేడుకను నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కోరుతున్నా' అని మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లే ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మిస్ వరల్డ్-2024 షెడ్యూల్
ప్రపంచ సుందరి పోటీలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. దిల్లీలోని భారత్ మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఫైనల్స్ ముంబయిలో జరగనున్నాయి. 2024 మిస్ వరల్డ్ పోటీలకి సంబంధించిన 'ఓపెనింగ్ సెర్మనీ' కార్యక్రమం ఫిబ్రవరి 20న జరగనుంది. ఇందులో భాగంగానే 'ఇండియా వెల్కమ్స్ ది వరల్డ్ గాలా' పేరుతో గ్రాండ్‌గా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇదంతా ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ఆధ్వర్యంలోనే జరగనుంది. ఇందుకోసం దిల్లీలోని ప్రసిద్ధ హోటల్ 'హోటల్ అశోక'ను ఎంపిక చేశారు. ఇక 71వ మిస్ వరల్డ్ ఫైనల్స్ మార్చి 9న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ (ముంబయి)లో జరగనుంది.
130కి పైగా దేశాల నుంచి
గత(2022) మిస్ వరల్డ్ విజేతగా పోలాండ్ దేశానికి చెందిన కరోలినా బిలావ్స్కా నిలిచారు. ఈమే ఈసారి భారత్‌లో జరిగే తదుపరి ప్రపంచ సుందరి పోటీల్లో గెలిచే వారికి మిస్ వరల్డ్ టైటిల్‌ను బహూకరించనున్నారు. ఈ ఈవెంట్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు సన్నద్ధమవ్వనున్నారు. మార్చి 9న జరిగే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్షప్రసారం ద్వారా చూడవచ్చు.