Microsoft Windows Reports Major Service Outage Globally : మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ అండ్ సర్వీసెస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, బ్యాంకులు, మీడియా సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడేందుకు కారణమైంది. వివిధ దేశాల్లో మైక్రోసాఫ్ట్ 365ను ఉపయోగిస్తున్న అనేక సంస్థలకు- తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. ఫలితంగా శుక్రవారం కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా వంటి విమానయాన సంస్థలతోపాటు వీసా, ఏడీటీ సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందిపడ్డాయి. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, స్కై న్యూస్ టీవీ, రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్‌గా బోర్డింగ్ పాస్‌లు జారీ చేయాల్సి రాగా, ప్రయాణాలు ఆలస్యమయ్యాయి.
భారత్‌లోని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు స్పైస్‌జెట్, ఇండిగో సహా దేశంలోని అన్ని విమానయాన సంస్థలూ ప్రకటించాయి. బోర్డింగ్ పాస్‌ల జారీ సహా ఇతర పనుల కోసం ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపాయి. అయితే, ఈ పరిస్థితి కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోర్డింగ్ పాస్ కోసం చాలాసేపు క్యూలో నిలబడాల్సి వచ్చిందని, సిబ్బంది తమ పేర్లను తప్పుగా రాసి ఇచ్చారని వాపోయారు.
బ్లూస్క్రీన్ ఎర్రర్
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య కారణంగా, ప్రపచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్‌ట్యాప్/ పీసీ స్క్రీన్‌లపై ఈ ఎర్రర్ కనిపించి, వెంటనే సిస్టమ్ షట్‌డౌన్ గానీ, రీస్టార్ట్ అవుతోంది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.