Melinda Gates Resigns :'బిల్ అండ్ మెలిండా గేట్స్' ఫౌండేషన్ పేరు మారింది. ఇకపై దాన్ని గేట్స్ ఫౌండేషన్‌గా పిలుస్తారు. ఎందుకంటే బిల్ గేట్స్ మాజీ సతీమణి మెలిండా గేట్స్ ఆ ఫౌండేషన్ నుంచి వైదొలిగారు. తొలుత 2021 సంవత్సరంలో తన భర్తకు విడాకులిచ్చిన మెలిండా గేట్స్, ఇప్పుడు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే తమ ఫౌండేషన్ నుంచి కూడా తప్పుకున్నారు. ఫౌండేషన్ నుంచి వైదొలగిన వేళ, భవిష్యత్తులో వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆమెకు రూ.లక్ష కోట్ల (12.5 బిలియన్ డాలర్లు) వాటా లభించింది. గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలగిన అంశాన్ని ఇటీవల ఎక్స్ (అప్పటి ట్విట్టర్) వేదికగా మెలిండా గేట్స్ వెల్లడించారు.
''ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులను రక్షించాల్సిన కీలక తరుణం ఇది. ఇది ఒక క్లిష్టమైన క్షణం'' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ''జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలి పదవి నుంచి వైదొలగాలని నేను నిర్ణయించుకున్నాను. ఫౌండేషన్‌లో నా చివరి వర్కింగ్ డే ఈ ఏడాది జూన్ 7వ తేదీ. బిల్, నేను కలిసి ఈ ఫౌండేషన్‌ను నిర్మించి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఇది ప్రపంచవ్యాప్తంగా అసమానతలను నిర్మూలించడానికి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫౌండేషన్ చాలా బలంగా ఉంది. దానికి మంచి నాయకత్వం కూడా ఉంది. అందుకే నేను వైదొలిగేందుకు ఇదే సరైన సమయమని భావించాను. తదుపరిగా నేను కూడా మహిళలు, బాలికల కోసం నా వంతుగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాను. ఇందుకోసం నా వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయి'' అని మెలిండా గేట్స్ వెల్లడించారు.
బిల్ గేట్స్ స్పందన
తన మాజీ భార్య మెలిండా నిర్ణయంపై బిల్ గేట్స్ స్పందించారు. ''ఫౌండేషన్ నుంచి మెలిండా తప్పుకున్నందుకు నేను చింతిస్తున్నాను. కానీ ఆమె తన భవిష్యత్ దాతృత్వ పనిలో కచ్చితంగా సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తారని బలంగా నమ్ముతున్నాను'' అని పేర్కొన్నారు.
బిల్, మెలిండా పెళ్లి జరిగిందిలా!
1987 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పర్సనల్ కంప్యూటర్ ఎక్స్‌పో ట్రేడ్ షో జరిగింది. ఆ కార్యక్రమంలోనే తొలిసారిగా మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్‌గేట్స్‌కు మెలిండా గేట్స్ పరిచయమయ్యారు. ఈ పరిచయంతోనే ఆమెకు తన కంపెనీలో బిల్‌గేట్స్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగమిచ్చారు. ఇద్దరూ దాదాపు ఏడేళ్లపాటు డేటింగ్ చేశారు. చివరకు 1994లో పెళ్లి చేసుకున్నారు.
మైక్రోసాఫ్ట్‌కు చెందిన సినిమానియా, పబ్లిషర్, వర్డ్, ఎక్స్‌పీడియా.కామ్ వంటి మల్టీమీడియా ఉత్పత్తుల అభివృద్ధిలో మెలిండా గేట్స్ కీలక పాత్ర పోషించారు. దీంతో మెలిండాకు ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ జనరల్ మేనేజర్‌గా బిల్‌గేట్స్ ప్రమోషన్ ఇచ్చారు. బిల్‌గేట్స్‌తో పెళ్లయిన రెండేళ్ల తర్వాత (1996 సంవత్సరంలో) మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి మెలిండా వైదొలిగారు. తమ ముగ్గురు పిల్లల పెంపకంపై పూర్తి దృష్టి పెట్టారు.